
Hyd: నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేసి, భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రిని ఆధునీకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రిని రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. 2,000 పడకల సామర్థ్యంతో 30 వైద్య విభాగాల సేవలను అందించనున్నారు. మొత్తం 26.30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రి నిర్మాణం జరుగనుంది.
వివరాలు
గోషామహల్ పరిరక్షణ సమితి బంద్‌కు పిలుపు
అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, గోషామహల్ పరిరక్షణ సమితి ఈ ఆస్పత్రి నిర్మాణానికి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆస్పత్రి నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని సమితి అభిప్రాయపడుతోంది. ప్రభుత్వం పునరాలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తోంది. గోషామహల్‌లో కాకుండా ఇతర ప్రదేశంలో ఆస్పత్రిని నిర్మించాలని కోరుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన రోజునే సమితి బంద్‌కు పిలుపునిచ్చింది, దీనితో పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.