CM Revanth: అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాం : రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అదానీ గ్రూపు విరాళాలపై కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ సంస్థపై లంచాల ఆరోపణల నేపథ్యంలో, స్కిల్స్ ఇండియా యూనివర్సిటీకి అదానీ గ్రూపు ప్రకటించిన ₹100 కోట్లు స్వీకరించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో వెల్లడిస్తూ, విమర్శల కారణంగా అదానీ విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అదానీ గ్రూపుకు లేఖ పంపినట్లు ఆయన వెల్లడించారు.
ప్రభుత్వంపై అనవసర వివాదాలు వద్దు
''అదానీ గ్రూపు గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందనే విమర్శలు వస్తున్నాయి. కానీ, రాజ్యాంగబద్ధంగా,చట్టబద్ధంగా అన్ని సంస్థల నుంచీ పెట్టుబడులు అనుమతిస్తాం. టెండర్ల ప్రక్రియను నిబంధనల మేరకే అమలు చేస్తాం. అంబానీ, అదానీ, టాటా వంటి కంపెనీలకు తెలంగాణలో వ్యాపార హక్కులు ఉన్నాయి. స్కిల్స్ యూనివర్సిటీ లక్షల మంది నిరుద్యోగులకు నైపుణ్యాలు నేర్పడం కోసం ప్రారంభించాం.కానీ ఈ యూనివర్సిటీ వివాదాలకు లోనవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అదానీ గ్రూపు ప్రకటించిన ₹100 కోట్లు సీఎస్‌ఆర్ కింద స్కిల్స్ యూనివర్సిటీకి ఇవ్వొద్దని లేఖ ద్వారా విజ్ఞప్తి చేసాము. అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివాదాల్లోకి లాగొద్దని స్పష్టంగా చెప్పాం. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదు'' అని సీఎం తెలిపారు.
దిల్లీ పర్యటనపై వివరణ
''నేటి దిల్లీ పర్యటనకు రాజకీయ సంబంధం లేదు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాం. పార్లమెంట్ సమావేశాలపై మంగళవారం ఎంపీలతో చర్చిస్తాం. రేపు కేంద్ర మంత్రులతో రాష్ట్ర సమస్యలపై సమావేశం అవుతాం. దిల్లీ పర్యటనలపై విమర్శలు వస్తున్నాయి, కానీ నేను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దిల్లీకి వెళ్లడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి సహకారం పొందడమే మా లక్ష్యం. అవసరమైతే దిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తాం'' అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.