Revanth Reddy:జిల్లాల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు..ఆక్రమణలపై చర్యలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం, మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం నుండి రోడ్డు మార్గం ద్వారా మహబూబాబాద్ చేరుకున్న సీఎం, సీతారాం తండాలో వరద ధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశారు.చెదిరిపోయిన రహదారులను పరిశీలించారు. అనంతరం పురుషోత్తమయ్యగూడెంలో నీటమునిగిన పంట పొలాలను పరిశీలించి, అధికారుల నుండి నష్టంపై వివరాలు సేకరించారు.
30 వేల ఎకరాల్లో పంట నష్టం
సీఎం రేవంత్ బాధితులకు ప్రభుత్వ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.ఆ తరువాత కలెక్టరేట్‌లో వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ప్రతి ప్రాంతంలోనూ వరద సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్లు,ఇన్‌చార్జ్ మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. వరదల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరిగిందని, అయితే ప్రాణనష్టం తక్కువగా ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని అంచనా వేశారు. ఇక ఆక్రమణల విషయంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని,హైడ్రా విధానాన్ని జిల్లాలకు విస్తరించాలని సూచించారు. చెరువులు, కుంటల కబ్జాలను కఠినంగా అడ్డుకుంటామని, ఈ విషయంపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.