ATLAS: 'అట్లాస్' రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం.. బాధ్యులైన పదిమందికిపైగా అధికారులపై చర్యలకు ఆదేశం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం (అట్లాస్) రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన తెలంగాణ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీఈఎస్)కు చెందిన 10 మందికిపైగా అధికారులను బాధ్యులుగా గుర్తించి, వారిని విధుల నుంచి తప్పించి, ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈ జాబితాలో ఓ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
డీఈఎస్, టీఎస్‌డీపీఎస్‌లు సంయుక్తంగా నివేదిక
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రతి సంవత్సరం "తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్" పేరుతో నివేదికను రూపొందించడం ఆనవాయితీ.
ఈ క్రమంలో, ఈ ఏడాది రూపొందించిన 184 పేజీల నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత వారం ఆవిష్కరించారు.
ఈ నివేదికలో రాష్ట్ర భౌగోళిక స్వరూపం, మౌలిక వసతులు, ఆర్థిక పరిస్థితి, విద్య, వాతావరణం, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, పరిశ్రమలు, సామాజిక భద్రత తదితర అంశాలకు సంబంధించిన డేటా, గ్రాఫిక్స్‌ను చేర్చారు.
ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డీఈఎస్, టీఎస్‌డీపీఎస్‌లు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించినట్టు తెలుస్తోంది.
వివరాలు
"ఫ్లాగ్‌షిప్ పథకం"గా కాళేశ్వరం
అయితే, గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన నివేదికలోని కొన్ని అంశాలను తాజా నివేదికలో కూడా యథాతథంగా పొందుపరిచినట్టు సీఎం కార్యాలయం (సీఎంవో) ఆలస్యంగా గుర్తించింది.
ముఖ్యంగా, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ, నివేదికలో మాత్రం పాత ప్రభుత్వ హయాంలో అమలైన పథకాల వివరాలను కొనసాగించారని గుర్తించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల గురించి వివరించారు.
ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ చేపట్టింది. అయితే, పాత నివేదికలో ప్రాజెక్టును "ఫ్లాగ్‌షిప్ పథకం"గా పేర్కొన్న విధంగా తాజా నివేదికలో కూడా అదే విధంగా పొందుపర్చారు.
వివరాలు
సంబంధిత అధికారులపై చర్యలు
అదేవిధంగా, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకాన్ని కాకుండా, గత ప్రభుత్వ హయాంలో అమలైన 'రైతుబంధు' పేరునే పేర్కొనడం సీఎం దృష్టికి వెళ్లింది.
ఈ నివేదికను సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తప్పిదాలకు బాధ్యులైన పదిమందికిపైగా అధికారులను గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
దీనికి అనుగుణంగా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.