Foxconn: ఫాక్స్‌కాన్‌కు మరో 60 ఎకరాల భూమి కేటాయింపు.. వచ్చే నెలలోనే ఉత్పత్తుల ప్రారంభం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 'హోన్ హాయ్ టెక్నాలజీ' గ్రూప్‌కి చెందిన 'ఫాక్స్‌కాన్' సంస్థ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ సంస్థ ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో 120 ఎకరాల భూమిలో ఉత్పత్తులను ప్రారంభించడానికి పనులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఫాక్స్‌కాన్ సంస్థలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి, సంస్థ ప్రతినిధులతో సంస్థ పురోగతి, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
,లిథియం బ్యాటరీల రంగాల్లో వాణిజ్య అవకాశాలు
ఈ సమీక్ష సమయంలో ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ సీఈవో మరియు ఛైర్మన్ సిడ్నీ ల్యూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని, ఎలక్ట్రిక్ వాహనాలు ,లిథియం బ్యాటరీల రంగాల్లో వాణిజ్య అవకాశాలను వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, నైపుణ్యమైన మానవ వనరులు లభ్యమవుతుండటంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హబ్‌గా మారిందని తెలిపారు. పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు.
సానుకూలంగా స్పందించిన రేవంత్
కంపెనీ ప్రతినిధులు ఫాక్స్‌కాన్ ఉత్పత్తులను నవంబర్ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అయితే, చైనా నుంచి కొందరు సాంకేతిక నిపుణులు హైదరాబాద్ రావడంలో వీసా సమస్యలు, అలాగే దిగుమతి చేసుకుంటున్న పరికరాలకు కస్టమ్స్ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇంకా, సంస్థ విస్తరణకు ప్రస్తుత భూమి సరిపోదని, 60 ఎకరాల అదనపు భూమి అవసరమని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంపెనీ ప్రతినిధుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫాక్స్‌కాన్ విస్తరణ కోసం 60 ఎకరాల అదనపు భూమిని కేటాయించడానికి కూడా అంగీకారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో..
ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.