Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. "కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?" అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఉమ్మడి జిల్లాల కోసం ప్రత్యేక అధికారులు
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా 9 ఉమ్మడి జిల్లాల కోసం ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.