CM Reventh Reddy: లగచర్ల రైతు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం.. విచారణకు ఆదేశాలు
తెలంగాణలో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జైలులో గుండెనొప్పితో అస్వస్థతకు గురైన లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లగచర్ల ఘటనలో 45 మంది రైతులు అరెస్టు అయి, నెల రోజులుగా జైలులో ఉన్నారు. ఈ క్రమంలో హీర్యా నాయక్‌కు తీవ్ర గుండెనొప్పి రావడంతో జైలు అధికారులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స కోసం తీసుకువెళుతున్న సమయంలో హీర్యా నాయక్ చేతులకు బేడీలు వేసి, గొలుసులతో కట్టేసి తీసుకెళ్లారు. ఆస్పత్రి లోపలికి ఇలానే తీసుకెళ్లడంతో ప్రజలు, రాజకీయ నాయకులు, న్యాయ నిపుణుల నుండి తీవ్ర నిరసనలు వ్యాపించాయి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే : కేటీఆర్
రైతులపై ఇలా ప్రవర్తించడం ప్రజా ప్రభుత్వానికి తగదని స్పష్టం చేశారు. అధికారులను ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. గుండెనొప్పితో బాధపడుతున్న రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేయడం అసహ్యకరమని అన్నారు. రైతును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేదా స్ట్రెచర్ వాడాల్సింది పోయి, బేడీలు వేసి తీసుకువెళ్లడం ఘోర తప్పిదమని పేర్కొన్నారు. ఈ చర్య రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని, క్రిమినల్ చట్టాలు, జైలు నియమావళి ప్రకారం ఇది పూర్తిగా అనైతికమని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విపక్షాలు ప్రభుత్వం తీరును గట్టిగా విమర్శించాయి