CM Revanth Reddy: ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. విద్యార్థులతో ముఖాముఖి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ కారణంగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచామని తెలిపారు. రాష్ట్రంలో 21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు, అలాగే 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు.
సామాజిక న్యాయం అందించేందుకు కుల గణన సర్వే
దేశ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 20-25 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నట్లు, వచ్చే అకడమిక్ సంవత్సరానికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. విద్యతో పాటు నైపుణ్యాలు ఉన్నప్పుడే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు
విద్యార్థులు, నిరుద్యోగుల నైపుణ్య అభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించినట్లు, టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నట్లు వివరించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని, దీనికి ప్రోత్సాహం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాబోయే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
15 వేల మంది విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం
సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని, విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో సచివాలయంలో ప్రవేశించాలని, పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మాదక ద్రవ్యాలు ఎక్కడ కనిపించినా 100కు డయల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. 14 నవంబర్ న 15 వేల మంది విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు, అదే రోజున ఫేజ్-2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు.