Cockroach Found in Meal on Train: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆహారంలో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు అందిస్తున్న ఆహారంలో బొద్దింకలు కనిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి షిర్డీ పర్యటన ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ముంబై వ్యాపారవేత్త కుటుంబానికి ఈ సంఘటన జరిగింది. రైల్లో తన సోదరికి వడ్డించిన పప్పులో బొద్దింకలు కనిపించాయని 48 ఏళ్ల రికీ జెస్వానీ తెలిపారు. దీనిపై రైల్వేశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నా సోదరి భోజనం పూర్తి చేసే సమయంలో, ఆమె పప్పు కంటైనర్ దిగువన బొద్దింకను గమనించింది," అని జెస్వానీ మనీకంట్రోల్‌తో చెప్పారు. "అప్పటికి నా 80 ఏళ్ల తండ్రితో సహా మా కుటుంబం మొత్తం కలుషితమైన పప్పును తిన్నారు.
అధికారికంగా ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు
మేము ఫిర్యాదు చేయడానికి ప్యాంట్రీ కారు వద్దకు వెళ్లినప్పుడు, డస్ట్‌బిన్ పక్కనే ఆహారం తయారు చేయడం చూశాము. చుట్టూ బొద్దింకలు " పాకుతున్నాయి" అని జెస్వానీ తెలిపారు. ఏసీ చైర్ కార్ కోచ్‌లోని సీ5 కోచ్‌లో వడ్డించిన పెరుగు కూడా చెడ్డదని జేస్వానీ ఆరోపించారు. ఈ విషయమై జెస్వానీ కుమారుడు ఆర్యన్ ఐఆర్‌సీటీసీ అధికారులను తిడుతూ.. 'మా తాతయ్య వయసు 80 ఏళ్లు.. బొద్దింకలు ఉన్న ఆహారం పెడతారా?'అంటూ నిలదీశారు. ఇంతకు ముందు కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే ఆహారంలో బొద్దింకలు కనిపించిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.