LOADING...
Revanth Reddy: కలెక్టర్లు గంట ముందే చేరుకోవాలి.. తక్షణ చర్యలు తీసుకోండి : సీఎం హెచ్చరిక
కలెక్టర్లు గంట ముందే చేరుకోవాలి.. తక్షణ చర్యలు తీసుకోండి : సీఎం హెచ్చరిక

Revanth Reddy: కలెక్టర్లు గంట ముందే చేరుకోవాలి.. తక్షణ చర్యలు తీసుకోండి : సీఎం హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్రమైన వర్షాలు, రైతుల సమస్యలు, ఆరోగ్య ప్రమాదాల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ఉదయం 7 గంటలకే కలెక్టర్లు ఇంటి నుంచి బయలుదేరి, క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని స్పష్టంగా తెలిపారు. ఏ కలెక్టర్ ఎక్కడికి వెళ్లారో, ఏం పనిచేశారు అన్నదాని పై రోజువారీ నివేదికలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం కార్యాలయం అందరికీ అందాల్సిందేనన్నారు. అజాగ్రత్తగా వ్యవహరించిన వారిపై మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Details

వర్ష సూచనలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలి 

భారీ వర్షాల నేపథ్యంలో రాజధానిలో ట్రాఫిక్ సమస్యలను సమర్థంగా ఎదుర్కొనాలని సీఎం సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు వర్షం పడే ప్రాంతాలకు మూడు గంటల ముందే చేరుకోవాలి. ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు, నీటి నిల్వలు వంటి సమస్యలకు సంబంధించి పోలీస్‌, ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఆరోగ్య విభాగం అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దోమల ప్రబలతతో డెంగీ, మలేరియా, గన్యా వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయని సీఎం హెచ్చరించారు. దోమల నివారణకు ఫాగింగ్, క్లోరినేషన్‌ను నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, పశువైద్యశాలల్లో సిబ్బంది కచ్చితంగా విధులకు హాజరవ్వాలి. హాజరుకాకపోతే చర్యలు తప్పవన్నారు.

Details

గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు క్షుణ్ణంగా పరిశీలించాలి 

గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కలెక్టర్లు ఆసుపత్రుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి కలెక్టర్ ఖాతాలో రూ. కోటి అత్యవసర నిధులు విపత్తు పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కలెక్టర్ ఖాతాలో రూ. కోటి అత్యవసర నిధులు విడుదల చేస్తుందని సీఎం తెలిపారు. చెరువులు, కుంటలు, కాల్వల నిర్వహణపై నీటిపారుదలశాఖ దృష్టి పెట్టాలని, గోదావరి, కృష్ణా నదీబేసిన్ల పరిధిలో నీటి ప్రవాహం వలన ఎలాంటి హాని కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Details

ఎరువుల పంపిణీ పర్యవేక్షణపై కఠిన ఆదేశాలు 

రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అవసరమైన నిల్వలు 10వ తేదీ వరకు ఉన్నాయని సీఎం తెలిపారు. అయినా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంతో రైతులు గందరగోళానికి లోనవుతున్నారని, వాస్తవాలు వారికి వెల్లడించాలని సూచించారు. ఎరువుల దుకాణాల వద్ద రోజువారీగా పంపిణీని కలెక్టర్లు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించాలి. ప్రతి దుకాణం వద్ద నిల్వల బోర్డులు, ఫోన్ నంబర్లు ఉండాలని స్పష్టం చేశారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారిమళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

Details

రేషన్ కార్డుల పంపిణీపై మార్గదర్శకాలు

రాష్ట్రంలో ప్రస్తుతం 96.95 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నట్లు సీఎం తెలిపారు. మరో 7 లక్షల కొత్త కార్డులు త్వరలో అందిస్తామన్నారు. దీంతో అదనంగా 31 లక్షల మందికి లబ్ధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, నోడల్ అధికారులు పాల్గొనాలన్నారు.

Details

ఎరువుల దుకాణాల వద్ద పోలీసుల నిఘా

ప్రతి ఎరువుల దుకాణం వద్ద ఇద్దరు పోలీసులు, ఒక రెవెన్యూ ఉద్యోగిని నియమించి పంపిణీ క్రమబద్ధంగా జరుగుతున్నదా అనే దానిపై నిఘా పెట్టాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. యూరియాను 20-30 శాతం ఇతర అవసరాలకు దారిమళ్లిస్తున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి, కోమటిరెడ్డి, పొన్నం, సీతక్క, వివేక్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సీఎస్ రామకృష్ణారావుతో పాటు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.