Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం
కాంగ్రెస్ పార్టీ సెబీ చైర్‌పర్సన్ మాధబి పురీ బుచ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమె సెబీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ నుండి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సోమవారం దిల్లీలో మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఆయన పేర్కొన్న విధంగా, ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని, ప్రజా సేవల్లో నైతికత,జవాబుదారీతనానికి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. పవన్ ఖేడా అభిప్రాయాన్ని బలోపేతం చేస్తూ, ఒక వ్యక్తి ఒకే చోట మాత్రమే వేతనం పొందాల్సిన నిబంధన ఉందని, కానీ మాధబి పురీ బుచ్ సెబీ ఛైర్‌పర్సన్ హోదాలో ఉండి కూడా ఐసీఐసీఐ బ్యాంక్, ప్రుడెన్షియల్ సంస్థల నుండి వేతనం పొందినట్లు ఆరోపించారు.
ఏడు సంవత్సరాలలో సుమారు రూ.16 కోట్లకు పైగా వేతనం
అదేవిధంగా, 2017-2024 మధ్యకాలంలో ఆమె ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు కూడా పొందారని తెలిపారు. ఇది సెబీ నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. మాధబి పురీ బుచ్ 2017 నుండి సెబీ సభ్యురాలిగా కొనసాగుతూ, 2022లో సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారని పవన్ వెల్లడించారు. గత ఏడు సంవత్సరాలలో ఆమె సుమారు రూ.16 కోట్లకు పైగా వేతనం పొందినట్లు ఆయన ఆరోపించారు. సెబీ చీఫ్‌గా కొనసాగుతూ, ఐసీఐసీఐ బ్యాంక్ నుండి వేతనం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బయట వ్యక్తుల ప్రభావం పడకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు.