Congress: ఎన్నికల నిబంధనలలో సవరణలు.. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్
కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఇటీవల ఈసీ సవరణలు చేసింది. ఈ చర్యతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత దెబ్బతింటుందంటూ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో మంగళవారం రిట్ పిటిషన్ వేసింది. ముందుగా ఎలక్ట్రానిక్ రికార్డులు, సీసీ టీవీ ఫుటేజ్, వెబ్‌కాస్టింగ్ రికార్డులు, అభ్యర్థులకు సంబంధించిన వీడియోలను తనిఖీ చేసేందుకు అనుమతి ఉండేది. అయితే, తాజా సవరణల ప్రకారం, ఇకపై సీసీ టీవీ ఫుటేజ్ వంటి రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించారు. ఈసీ ప్రకటనలో ఈ చర్య వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలగకుండా చూస్తున్నట్లు పేర్కొంది.
న్యాయశాఖ, ఈసీ వేర్వేరు వివరణలు
అలాగే, సీసీ టీవీ ఫుటేజ్ వినియోగంతో కృత్రిమ మేధ ద్వారా నకిలీ వీడియోలు తయారయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రూల్ 93కి సవరణ అనంతరం అభ్యర్థులకు మాత్రమే ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని, ఇతరుల తనిఖీకి అనుమతి లేదని స్పష్టత ఇచ్చింది. ఈ సవరణకు కేంద్ర న్యాయశాఖ, ఎన్నికల సంఘం సిఫార్సు మేరకే ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లో మార్పులు చేశాయి. గత శుక్రవారం న్యాయశాఖ, ఈసీ వేర్వేరు వివరణలు ఇచ్చి, ఒక కోర్టు కేసు కారణంగా ఈ సవరణ చేపట్టినట్లు వెల్లడించాయి.
మార్పులను న్యాయపరంగా సవాలు చేస్తాం: జైరాం
కానీ, కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని, ఈసీ నిబంధనల మార్పు చేయడం విడ్డూరమని విమర్శించింది. ఈ మార్పులను న్యాయపరంగా సవాలు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పులను పాటించాల్సిన ఎన్నికల సంఘం, తగిన నియమావళిని మార్చడం అర్ధరహితమని ఆయన వ్యాఖ్యానించారు.