కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం మోదీ 'విషసర్పం'తో పోల్చగా, శనివారం మోదీ ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీదర్‌లోని హుమ్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, తనపై మల్లికార్జున్ ఖర్గే చేసిన 'విష సర్పం' వ్యాఖ్యను కలుపుకొని కాంగ్రెస్ తనను ఇప్పటి వరకు "91 సార్లు" దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ తనను తిట్టిన ప్రతిసారి ఆ పార్టీకే నష్టం జరుగుతుందని మోదీ పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్‌ను తనను తిట్టినా తాను కర్ణాటక ప్రజల కోసం పని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ఓట్లకోసం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు
కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను కూడా దుర్భాషలాడిందని, వీర్ సావర్కర్‌లో కూడా అలాగే వ్యవహరించిటన్లు ప్రధాని పేర్కొన్నారు. సామాన్యుల గురించి మాట్లాడేవారిని, వారి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని కాంగ్రెస్ ద్వేషిస్తోందన్నారు. ఓట్ల ద్వారా కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఓట్లకోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. పేదల కష్టాలు, బాధలను కాంగ్రెస్ ఎప్పటికీ అర్థం చేసుకోదన్నారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటకకు తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు. కాంగ్రెస్ సీట్ల గురించి మాత్రమే పట్టించుకుంటుందని, రాష్ట్ర ప్రజల గురించి కాదన్నారు. కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో కేవలం గెలవడమే కాదు, దేశంలోనే రాష్ట్రాన్ని నెం.1గా నిలపడం అన్నారు.