Congress MP contestant's List: లోక్ సభ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతోకూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్, గోవా, డీఎన్ హవేలీ నియోజకవర్గాలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. సౌత్ గోవాకు విరియాటో ఫెర్నాండెజ్, నార్త్ గోవాకు రమాకాంత్ కలప్, సత్యపాల్ సింగ్ సికర్వార్కు మోరెనా నియోజకవర్గానికి, ఖాండ్వాకు నరేంద్రపాటిల్, గ్వాలియర్కు ప్రవీణ్ పాఠక్, దాదర్ నగర్ హవేలీకి అజిత్ రాంజీభాయ్ మహల్ ను పోటీకి కేటాయించింది. కాగా, గోవా సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ ప్రాన్సిన్స్ కోకు ఈ సారి సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే పలు సీట్లకు ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మేనిఫెస్టో పట్ల మహిళల్లో సానుకూల స్పందన
ఇప్పటికే మహిళలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలను ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల అటు కాంగ్రెస్ వర్గాల్లోనూ, మహిళల్లో సానుకూల స్పందన లభిస్తోంది. ప్రకటించిన పథకాలన్నింటినీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని అధిష్టానం పార్టీ నేతలకు ఆదేశించింది. దేశంలో తొలివిడత ఎన్నికలు ఏప్రిల్ 19 న జరగనుండగా, ఏప్రిల్ 25న రెండో విడత, మే 7న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న నాలుగో విడత, మే 20న ఐదో దశ, మే 25న ఆరో విడత, జూన్ 1న తుది దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4 దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.