నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారంతో మూగియనుంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విజయవంతంగా పూర్తి చేసుకొన్నయాత్ర శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో గల చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో అధికారికంగా ముగియనుంది. ముగింపు కార్యక్రమం శ్రీనగర్‌లోని జమ్ముకాశ్మీర్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. అనంతరం షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో సభను ఏర్పాటు చేశారు. 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుకలకు భావసారూప్యత గల 21పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. కాంగ్రెస్ ఆహ్వానం పంపిన పార్టీల జాబితాలో ఆప్, బీఆర్ఎస్ కూడా ఉండటం గమనార్హం. ఏఐఏడీఎంకే, వైఎస్సార్సీపీ, బీజేడీ, ఏఐఎంఐఎం, ఏఐయూడీఎఫ్‌కు మాత్రం ఆహ్వానం పంపలేదు.
12 బహిరంగ సభలు, 100కి పైగా కార్నర్ మీటింగ్‌లు
భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ సహా 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా జమ్ముకశ్మీర్ వరకు పాదయాత్ర సాగింది. రాహుల్ గాంధీ 4,080 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మొత్తం 12 బహిరంగ సభలు, 100కి పైగా కార్నర్ మీటింగ్‌లు, 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, 275కి పైగా ప్లాన్డ్ వాకింగ్ ఇంటరాక్షన్‌లు, 100కి పైగా సిట్టింగ్ ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.