LOADING...
Rohit Sharma: రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ నాయకురాలు అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్‌
రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ నాయకురాలు అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్‌

Rohit Sharma: రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ నాయకురాలు అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు సారథి, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకురాలు బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు. అతడిని కించపరిచేలా చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై బీజేపీ (BJP) స్పందిస్తూ, ప్రతిపక్ష నేతపై తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాదు, "రాహుల్ గాంధీ (Rahul Gandhi) క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా?" అంటూ ఎద్దేవా చేసింది.

వివరాలు 

అసలేం జరిగిందంటే? 

ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 17 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై కాంగ్రెస్ (Congress) అధికార ప్రతినిధి శమా మహమ్మద్‌ ఎక్స్ (X)లో ఓ పోస్ట్ చేశారు. "క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్‌గా లేడు. అతడు బరువు తగ్గాలి. అంతేకాదు, గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి ఇతడే" అంటూ వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వివాదం రాజుకుంది.

వివరాలు 

బీజేపీ తీవ్ర విమర్శలు

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి కాంగ్రెస్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. "ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు! భారత క్రికెట్ కెప్టెన్‌ను కూడా వారు వదలట్లేదు. రాజకీయాల్లో విఫలమైన వారి నేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారేమో!" అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నేత షెహ్‌జాద్‌ పూనావాలా కూడా మండిపడుతూ.. "రాహుల్ గాంధీ కెప్టెన్సీలో వారు 90 ఎన్నికల్లో ఓడిపోయారు. దిల్లీలో డకౌట్ అయ్యారు. టీ20 ప్రపంచకప్ తెచ్చిన వ్యక్తిని విమర్శించడం వారికి ప్రాధాన్యంగా మారింది. భారతీయ సంస్థలు, మన సాయుధ దళాలను వ్యతిరేకించే ఆ పార్టీ ఇప్పుడు క్రీడాకారులపైనా విమర్శలు గుప్పిస్తోంది. వారివి ప్రేమ దుకాణాలు కాదు.. విద్వేష కేంద్రాలు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాలు 

నెటిజన్ల స్పందన 

కాంగ్రెస్ నాయకురాలి వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, "నేను కేవలం సాధారణ కోణంలోనే చెప్పాను. ధోనీ, కోహ్లీ, కపిల్ దేవ్ వంటి గత కెప్టెన్లను రోహిత్‌తో పోలుస్తూ వ్యాఖ్యానించాను. ప్రజాస్వామ్య దేశంలో మాకు మాట్లాడే హక్కు కూడా లేదా?" అని ప్రశ్నించారు.