నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణలో దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం కోసం తెలంగాణకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం తెలంగాణ పర్యటనకు వస్తన్నారు. రెండు సభల్లో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రియాంక గాంధీ మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీల గురించి ఆమె వివరించనున్నారు. ఈ ఆరు గ్యారంటీల వల్ల మహిళలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయనే విషయాన్ని ప్రియాంక చెప్పనున్నారు. అనంతరం కొల్లాపూర్‌కు చేరుకుని అక్కడ 'పాలమూరు ప్రజాభేరి' పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.
నవంబర్ 1, 2 తేదీల్లో రాహల్ పర్యటన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. నవంబర్ 1, 2 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 1న కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్ రాహుల్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 2వ తేదీన మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్ సభలకు రాహుల్ హాజరుకానున్నారు. అక్టోబర్ 9న అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తెలంగాణలో రాహుల్ పర్యటించడం ఇది రెండోసారి. అక్టోబర్ 18న ములుగులో కాంగ్రెస్ బస్సుయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 19న రెండో రోజు యాత్రలో పాల్గొన్నారు. ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లోని మొదటి విడతలో పర్యటించారు.