బ్యాక్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇండియా కారును నడుపుతున్న మోదీ.. రాహుల్ గాంధీ ఫైర్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బ్యాక్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇండియా కారును నడుపిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అద్దంలో చూసి కారు నడుపుతూ, మళ్లీ ప్రమాదం ఎందుకు జరిగిందనే కోణంలో మోదీ, భాజపాలు ఉన్నాయంటూ ఆయన ఎద్దేవా చేశారు. కమల పార్టీ నేతలెప్పుడూ గతం గురించే మాట్లాడతారని ఫైరయ్యారు. ఆ పార్టీ నాయకత్వం భవిష్యత్ పై మాత్రం ఆలోచనలు చేయరన్నారు. భారత భవిష్యత్ గురించి ఆలోచించే శక్తి సామర్థ్యాలు వారికి ఇంకా రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో మత రాజకీయాలు చేయడంలో ఆర్ఎస్ఎస్ ముందు వరుసలో ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే అడ్డుకోగలమని, ద్వేషంతో తెంచలేమన్నారు.
ఒడిశా మృతులకు అమెరికాలో రాహుల్ శ్రద్ధాంజలి
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ న్యూయార్క్ లోని జవిట్స్ సెంట్ లో ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒడిశా రైలు దుర్ఘటనపై పెదవి విరిచిన రాహుల్, ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఏం జరిగినా గతం తవ్వడమే తప్ప భవిష్యత్ తెలియదు : అసలు రైలు దుర్ఘటన ఎందుకు జరిగిందని బీజేపీ నేతలను అడిగితే, ఈ రైల్వే మార్గాన్ని 50 ఏళ్ల కిందట కాంగ్రెస్ నిర్మించిందని, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని అనే మాటలు వదులుతారన్నారు. పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, పరిణామ సిద్ధాంతం తొలగించారెందుకు అంటే 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పెట్టింది లాంటి జవాబులిస్తారని రాహుల్ చురకలు అంటించారు.
ఆనాడు కాంగ్రెస్ మంత్రి రాజీనామా చేశారు: రాహుల్
ఎక్కడ ఏం జరిగినా గత ప్రభుత్వాల మీద నెపం నెట్టడం తప్ప ఇంకో ధ్యాస లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రమాదం జరిగితే బ్రిటీష్ విధానం వల్లే జరిగిందని ఆనాడు తాము చెప్పలేదని రాహుల్ గుర్తు చేశారు. ఆ సందర్భంలో రైల్వేశాఖ మంత్రిగా కాంగ్రెస్ నేత రాజీనామా చేయడాన్ని గుర్తు చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి, భాజపాకు ఉన్న ప్రధాన తేడా అని స్పష్టం చేశారు. గాంధీ, గాడ్సేల పోరాటం లాంటిదే.. కాంగ్రెస్, భాజపాలది గాంధీ, గాడ్సేల పోరాటంగా అభివర్ణించారు. గాంధీ ముందు చూపు గలవాడని, విశాల దృక్పథం గలవారని రాహుల్ కీర్తించారు. మరోవైపు గాడ్సే ఎప్పుడూ గతం గురించే మాట్లాడాతాడని, కోపం, ఈర్ష్య, ద్వేషంతో జీవితాన్నే నరకంగా మార్చుకున్నాడన్నారు.