సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
రాహుల్ గాంధీ నేతృత్వంలోని గతేడాది నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర' మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 7న భారతదేశంలోని అన్ని జిల్లాల్లో 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చింది. 'భారత్ జోడో యాత్ర' రెండోదశ కూడా త్వరలో నిర్వహించనున్నారు. ఈ సారి గుజరాత్‌లో ప్రారంభమై ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ వరకు సాగుతుంది. రెండోదేశ యాత్ర ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిర్వహించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మొదటి దశ యాత్ర 130 రోజుల పాటు కొనసాగింది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ లోయ వరకు దాదాపు 4,000 కి.మీ సాగింది.
కర్ణాటక ఎన్నికలపై రాహుల్ యాత్ర ప్రభావం
రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' కర్ణాటక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఒక కారణంగా నిలిచింది. ఇదిలా ఉండే, సెప్టెంబర్ 7వ తేదీ జిల్లాల్లో నిర్వహించాల్సిన జోడో యాత్రపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ స్పందించారు. ఆరోజు సాయంత్రం 5:00 నుంచి 6:00 గంటల వరకు "భారత్ జోడో పాదయాత్ర" నిర్వహించి మద్దతును తెలియజేయాలని కోరారు. రెండో విడత యాత్రకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి యాత్ర ప్రారంభం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.