LOADING...
Hyderabad: ఇండియా గేట్ తరహాలో హైదరాబాద్‌లో ల్యాండ్‌మార్క్ నిర్మాణం.. రేవంత్ రెడ్డి కీలక సూచన
ఇండియా గేట్ తరహాలో హైదరాబాద్‌లో ల్యాండ్‌మార్క్ నిర్మాణం.. రేవంత్ రెడ్డి కీలక సూచన

Hyderabad: ఇండియా గేట్ తరహాలో హైదరాబాద్‌లో ల్యాండ్‌మార్క్ నిర్మాణం.. రేవంత్ రెడ్డి కీలక సూచన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ను పరిశుభ్రంగా కాలుష్యరహితంగా అభివృద్ధి చేయాలన్న దృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మూసీ నది అభివృద్ధికి సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టం చేశారు. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి మూసీ వైపు వచ్చే మార్గంలోని కోత్వాల్‌గూడ జంక్షన్ వద్ద, ఇండియా గేట్, గేట్‌వే ఆఫ్ ఇండియా, చార్మినార్ తరహాలో గుర్తింపు ల్యాండ్‌మార్క్ నిర్మించాలని సూచించారు.

Details

పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం కులీ కుతుబ్‌షాహీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్గదర్శకాలను పునః సమీక్షించి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పాతబస్తీలో మెట్రో రైలు పనులకు ఇప్పటికే నిధులు మంజూరైనందున ఆ పనులను వెంటనే వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ నదిపై బ్రిడ్జి కమ్ బ్యారేజీల నిర్మాణానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జూపార్క్ వద్ద మరియు మీరాలం చెరువు సమీపంలో టూరిస్టులకు తగిన వసతులతో హోటళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక తదుపరి 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Details

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఇంకా ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మహానగరాల్లో కాలుష్య సమస్యలపై అధ్యయనం చేసి, హైదరాబాద్ ఆ దిశగా వెళ్లకుండా చూడాలని చెప్పారు. ముఖ్యంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్ సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ORR (ఔటర్ రింగ్ రోడ్) వెలుపల తరలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిర్మాణ రంగం నుంచి వచ్చే వ్యర్థాలను యథేచ్చగా డంప్ చేయకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. చివరిగా సీవరేజ్ బోర్డు మంచినీరు, మురుగు నీటి సరఫరా వ్యవస్థలను సమగ్రంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎంరెవంత్ రెడ్డి ఆదేశించారు.