Basavatarakam: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం.. అమరావతిలో 15 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని బసవ తారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన స్థలం ఇటీవల ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ పరిశీలించారు. నిర్మాణ స్థలంలో ప్రస్తుతం ఉన్న హెచ్‌టీ విద్యుత్ లైన్లను తొలగించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించి ట్రాన్స్‌కోకు సీఆర్డీఏ అధికారులు లేఖ రాశారు. లైన్ల తొలగింపు పనులు కాంట్రాక్టుకు అప్పగించారని సమాచారం.
జనవరిలో నిర్మాణ పనులు
ప్రారంభ విడతలో 300 పడకలతో ఆసుపత్రి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం కాగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను 1000 పడకలకు పెంచాలని యాజమాన్యం భావిస్తోంది. ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే రూపొందించారు. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటికే రెండు సార్లు నందమూరి బాలకృష్ణ సీఆర్డీఏ కమిషనర్‌తో సమావేశాలు నిర్వహించి, అన్ని అంశాలపై చర్చలు జరిపారు. విద్యుత్ లైన్ల తొలగింపు పూర్తి అయితే, జనవరి నెలలో నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది.