
Amaravati: రూ.904 కోట్లతో అమరావతి గ్రామాల్లో మౌలిక వసతులు.. సీఎం అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామకంఠాల్లో ఉన్న 29గ్రామాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.904 కోట్లు కేటాయించనుంది. వీటిని అభివృద్ధి చేసి రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ 51వ సమావేశంలో ఈ కీలక తీర్మానం జరిగింది. మంగళగిరి పరిధిలో 78.01 ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ స్థాపన కోసం భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించారు. అలాగే రాజధాని ప్రాజెక్టులలో అంతర్జాతీయ విమానాశ్రయం,స్పోర్ట్స్ సిటీ, ఐకానిక్ బ్రిడ్జి వంటి ప్రధాన పనుల అమలుకు ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రైతులు భూమి ఇచ్చినప్పుడు వారికి కేటాయించే రిటర్నబుల్ ప్లాట్లలో ఎసైన్డ్ అనే పదాన్ని తొలగించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
రాజధానిలో వైద్య రంగ అభివృద్ధి
రాజధానిలో వైద్య రంగ అభివృద్ధి కోసం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, విట్‌కి తలా వంద ఎకరాలు కేటాయించి డెంటల్, మెడికల్, పారా మెడికల్ కళాశాలల స్థాపనకు అనుమతించాలని నిర్ణయించారు. ఈ రెండు సంస్థలు మొదట 17 వేలమంది విద్యార్థులతో ప్రారంభించి, తర్వాత అదనపు భూమి కోసం ఒప్పందం మేరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. సమావేశం ముగిసిన అనంతరం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరాలు తెలియజేశారు.
వివరాలు
తాగునీరు - రోడ్లు - మురుగునీటి శుద్ధి
మంత్రి నారాయణ వివరాల ప్రకారం,రాజధాని పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లలో ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల కోసం భారీ నిధులు ఖర్చు చేస్తున్నారు. రూ.64.35 కోట్లతో తాగునీటి సౌకర్యం, రూ.339.04 కోట్లతో రహదారుల నిర్మాణం, రూ.110.72 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు,రూ.12.25 కోట్లతో వీధి దీపాల ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలను ఈ నెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం కోసం ఉంచుతారు. ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారు. ప్రాజెక్టుల నిర్వహణను (O&M) కలిపి మొత్తం రూ.904 కోట్లు ఖర్చు కానున్నాయి. అలాగే రాజధానిలో వాడిన నీటిని శుద్ధి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు రూ.787.59 కోట్లతో రెండు ప్యాకేజీల్లో టెండర్లు పిలుస్తారు.
వివరాలు
మహాలక్ష్మి హోటల్ కన్సార్షియంకు ఒక ఎకరం భూమి
మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు రాబడి, దాదాపు 20 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందని అంచనా. మహాలక్ష్మి హోటల్ కన్సార్షియంకు ఒక ఎకరం భూమి కేటాయించనున్నారు. రాజధాని రూపకల్పనలో భాగంగా సీడ్ క్యాపిటల్ ఎడమ, కుడి వైపులా రెండు వంతెనలు ప్రతిపాదించారు. అందులో భాగంగానే వైకుంఠపురం వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. కరకట్ట రోడ్డుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి వైపు కలిపేలా వై ఆకారంలో కొత్త రహదారి ఏర్పాటు చేయనున్నారు. ఇక అవుటర్ రింగ్ రోడ్డును కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.
వివరాలు
వైకాపాకు నారాయణ సవాల్
రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేస్తున్న వైకాపా నేతలు ఎక్కడ మునిగిందో చూపాలని మంత్రి నారాయణ సవాల్ విసిరారు. ఐకానిక్ టవర్ల కోసం గుంతలు తవ్వడం వల్ల వర్షాకాలంలో నీరు నిలిచిందని, దానిని రాజధాని మునిగిపోయిందని తప్పుగా చూపిస్తున్నారని విమర్శించారు. వచ్చే మూడున్నరేళ్లలో రాజధాని మొదటి దశ పనులు పూర్తి చేస్తామని, ఏడాదిన్నరలో 300 కి.మీ. రహదారులు వినియోగంలోకి వస్తాయని తెలిపారు. మార్చి 31 నాటికి 4 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు.
వివరాలు
సీఆర్‌డీఏ నిధులతో కాలువల పనులు
వైకాపా ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసిన విజయవాడ వరదనీటి కాలువలు, గుంటూరులో యూజీడీ పనులను సీఆర్‌డీఏ నిధులతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి నారాయణ తెలిపారు. త్వరలో అంచనాలు రూపొందించి టెండర్లు పిలుస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం మళ్లించేసిందని ఆయన మండిపడ్డారు.