
Telangana: వర్షాభావ ప్రభావంతో పంటల సాగు తగ్గుదల.. వ్యవసాయ శాఖ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది వానాకాలం సాగు సీజన్‌లో వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల,సాధారణంగా సాగు చేయాల్సిన విస్తీర్ణంతో పోలిస్తే రైతులు తక్కువగా పంటలు వేశారు. అలాగే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కూడా ఈసారి పంటల విస్తీర్ణం తగ్గినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో పేర్కొంది. అయితే వరి సాగు మాత్రం కొంతమేర పెరిగిందని సమాచారం.ముఖ్యంగా పత్తి సాగు గత ఏడాది కంటే 2.36 లక్షల ఎకరాల మేరకు తగ్గిందని చెప్పింది. గతేడాది జూన్ నెలాఖరుకు మొత్తం 46,95,010ఎకరాల్లో పంటలు సాగు చేయగా,ఈసారి అదే సమయంలో 43,47,761 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. మొత్తంగా ఈ ఏడాది 3,47,249 ఎకరాల తగ్గుదల నమోదైనట్టు వ్యవసాయశాఖ బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
వివరాలు
పంటలవారీగా సాగు వివరాలు:
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాధారణంగా సాగు చేయాల్సిన విస్తీర్ణం 1,32,44,305 ఎకరాలు. గత ఏడాది జూన్ చివరి వరకు 46,95,010 ఎకరాల్లో సాగు చేయగా,ఈ ఏడాది ఇప్పటివరకు 43,47,761 ఎకరాలే సాగులో ఉన్నాయి. ఇది సాధారణ లక్ష్యంలో కేవలం 32.83 శాతమే. పత్తి: గత ఏడాది 33,05,469 ఎకరాల్లో సాగు కాగా,ఈసారి అది 30,69,342 ఎకరాలకు తగ్గింది. పెసలు: గత సీజన్‌లో 31,501 ఎకరాల్లో పెసలు సాగు కాగా,ఈ ఏడాది అది 26,414 ఎకరాలకు పడిపోయింది. వరి: సాధారణంగా వరి సాగు లక్ష్యం 62,47,868 ఎకరాలు. గత సంవత్సరం ఇదే సమయానికి వరి 1,56,100 ఎకరాల్లో సాగు కాగా, ఈసారి 2,13,746 ఎకరాలకు పెరిగింది. ఇది సాధారణ లక్ష్యంలో 3.42 శాతంగా ఉంది.
వివరాలు
ఇతర ప్రధాన పంటలు:
జొన్న - 23,030 ఎకరాలు మొక్కజొన్న - 2,47,934 ఎకరాలు కందులు - 2,70,342 ఎకరాలు సోయాబీన్ - 2,63,524 ఎకరాలు చెరకు - 14,941 ఎకరాలు
వివరాలు
జిల్లాల వారీగా సాగు స్థితి:
జూలై మొదటి వారం నాటికి 17 జిల్లాల్లో సాధారణ సాగు లక్ష్యంలో 25 శాతం మేరకే సాగు పూర్తయ్యింది. 10 జిల్లాల్లో సాగు 26% నుంచి 50% మధ్యలో ఉంది. నాలుగు జిల్లాల్లో 51% నుంచి 75% వరకు ఆదిలాబాద్ జిల్లాలో 76% వరకు సాగు పూర్తైంది. వర్షపాతం పరిస్థితి: వర్షాల పరంగా చూస్తే, గత సంవత్సరం జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 169.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ ఈ ఏడాది అదే సమయంలో కేవలం 138 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.
వివరాలు
లోటు వర్షాల కారణంగా ఎనిమిది జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. అవి:
మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, భూపాలపల్లి, జనగామ, మేడ్చల్, సూర్యాపేట, హైదరాబాద్. ఇక 21 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. నాలుగు జిల్లాల్లో మాత్రం సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు వ్యవసాయశాఖ నివేదిక తెలిపింది.