Telangana: వానాకాలంలో సాగు టార్గెట్ కోటి ఎకరాలు
వానాకాల సీజన్‌లో తెలంగాణ రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో రాష్ట్ర వ్యవసాయశాఖ క్లారిటీ ఇచ్చింది. బుధవారం నాటికి కోటి ఎకరాల పంటలను వేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. 1,01,16,689 ఎకరాలు సాగులోకి వచ్చిందని తెలిపింది. వానాకాలంలో 1,29,32,310 ఎకరాలు లక్ష్యం ఉండగా, అందులో 78.23 శాతం మేరకు పంటలు సాగవుతున్నాయని వెల్లడించింది. గతేడాది వానాకాలం సీజన్‌లో 1,08,95,89 ఎకరాలు సాగు చేశారు. అయితే ఈ ఏడాది దాదాపు 7.79 లక్షల ఎరాల మేరకు సాగు తగ్గిందని ప్రకటించింది.
ఆదిలాబాద్ జిల్లాలో వందశాతం పంటలు సాగు
వరిసాగు గతేడాది 43.14 లక్షల ఎకరాలు ఉండగా, ఈ ఏడాది 40.73 లక్షలుగా ఉందని తెలిపింది. ఇక మొక్కజొన్న గతేడాది 5.02 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి 4.44 లక్షల ఎకరాలు ఉంది. కందులు నిరుడు 4.55 లక్షల ఎకరాలు కాగా ఈసారి 4.42 లక్షల ఎకరాలుగా ఉందని పేర్కొంది. పత్తి గతేడాది 44.52 లక్షల ఎకరాలుండగా, ఈసారి 42.22 లక్షల ఎకరాలేనని తెలిపింది. సోయా నిరుడు 4.43 లక్షల ఎకరాలు, ఈసారి 3.76 లక్షల ఎకరాలు పండిస్తున్నారన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వందశాతం పంటలు సాగు అయ్యాయి. మరోవైపు వనపర్తిలో 41 శాతమే పంటలు వేయడం గమనార్హం.