
CRPFs 86th Raising Day: 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే : అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
నక్సలైట్లు ప్రస్తుతం కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిమితమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ఆయన తెలిపారు.
నక్సలైట్లను నిర్మూలించడంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలకంగా పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లాలో ఈరోజు సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)తో పాటు, సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా బెటాలియన్ ముఖ్య పాత్ర పోషించిందని చెప్పారు.
వివరాలు
400 ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌ల ఏర్పాటు
కోబ్రా అంటే "కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్". ఈ యూనిట్ భద్రతా దళాల్లో ప్రత్యేకమైన శిక్షణతో పనిచేస్తోంది.
గెరిల్లా పద్ధతిలో జరిగే అటవీ యుద్ధాల్లో ఈ బృందానికి విపరీతమైన అనుభవం ఉంది.
నక్సలైట్లను ఎదుర్కొనేందుకు ఈ కోబ్రా దళం ప్రత్యేక ఆపరేషన్‌లు నిర్వహిస్తూ తమ సత్తా చాటుతోంది.
నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 400 ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లను ఏర్పాటు చేశామని షా తెలిపారు.
ఈ చర్యల వల్ల ఆ ప్రాంతాల్లో హింస గణనీయంగా తగ్గిందని చెప్పారు. దాదాపు 70 శాతం హింస తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ సమస్య తుది దశకు చేరుకుందని వివరించారు.
వివరాలు
దేశంలోని ప్రతి విజయంలో సీఆర్పీఎఫ్ జవాన్ల పాత్ర అమూల్యం
దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ అందిస్తున్న సేవలు అసాధారణమైనవని అమిత్ షా ప్రశంసించారు.
కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపనలోనూ, అలాగే నక్సలైట్లను ఎదుర్కొనడంలోనూ సీఆర్పీఎఫ్ వేసిన అడుగులు చాలా గొప్పవని కొనియాడారు.
దేశంలోని ప్రతి విజయంలో సీఆర్పీఎఫ్ జవాన్ల పాత్ర అమూల్యమైందని అన్నారు. నక్సలిజాన్ని అణిచివేయడమే సీఆర్పీఎఫ్ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
కోబ్రా కమాండోల పేరుని వింటేనే నక్సల్స్ భయపడతారని అన్నారు. ధైర్యానికి ప్రతీకగా కోబ్రా బెటాలియన్ నిలిచిందని కొనియాడారు.
86వ రైజింగ్ డే సందర్భంగా కోబ్రా యూనిట్ జవాన్లకు అభినందనలు తెలిపారు.
వివరాలు
నక్సలిజాన్ని నిర్మూలించడంలో సీఆర్పీఎఫ్ ముందడుగు
మీ నాయకత్వంలో సీఆర్పీఎఫ్ నక్సలిజాన్ని నిర్మూలించడంలో ముందడుగు వేసిందని చెప్పారు.
2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజం పూర్తిగా నిర్మూలించబడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది దేశం తీసుకున్న సంకల్పమని పేర్కొన్నారు. ఈ కార్యం సాధించేందుకు సీఆర్పీఎఫ్ అండగా నిలుస్తుందని అన్నారు.
ప్రతి ఏడాది మార్చి 19న సీఆర్పీఎఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1950లో ఇదే రోజున కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సీఆర్పీఎఫ్ జెండాను అధికారికంగా అందించారు.
అయితే ఈ సంవత్సరం వేడుకలను విస్తరించిన కారణంగా ఏప్రిల్ 17న పరేడ్ నిర్వహించారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వివరాలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మార్చిన పటేల్
నీముచ్ జిల్లా కూడా సీఆర్పీఎఫ్ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగివుంది.
1939, జూలై 27న బ్రిటిష్ పాలకులు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ విభాగాన్ని అక్కడ ఏర్పాటు చేశారు.
అనంతరం 1949, డిసెంబరు 28న కేంద్ర హోంమంత్రి పటేల్ దానిని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మార్చారు.