Cyclone Dana : దానా తుపాను ఎఫెక్టు.. ఏపీలో తేలికపాటి వర్షాలు, ఒడిశా-పశ్చిమ బెంగాల్‌కు భారీ ముప్పు!
ఒడిశా తీరం వైపు దూసుకెళుతున్న 'దానా' తుపాను, రాష్ట్రంలో ప్రజలన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం మధ్య అండమాన్ సముద్రంలో ఉన్న వాయుగుండం, అక్టోబర్ 23 నాటికి 'దానా' తుపానుగా మారనుంది. దీంతో అక్టోబర్ 24 ఉదయం నాటికి ఇది ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దానా తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై ప్రభావం చూపునుంది. అక్టోబర్ 23న ఒడిశా తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
గంగానది తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
అక్టోబర్ 24, 25 తేదీల్లో ఒడిశాలో భారీగా వర్షాలు పడవచ్చని అంచనా. పూరీ, ఖుర్దు, గంజన్, జగత్‌సింగ్‌ఫూర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లో అక్టోబర్ 23న తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇక అక్టోబర్ 24, 25 తేదీల్లో గంగానది తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. హౌరా, తూర్పు-పశ్చిమ మేదినిపొర, నార్త్-సౌత్ 24 పరగణాస్‌లో కూడా భారీ వర్షాలు పడవచ్చు. దానా తుపాను కారణంగా రోడ్లు జలమయమవ్వడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడం, కొండచరియలు విరిగే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరీకలు జారీ చేసింది.
కొన్ని చోట్ల 30 సెంటీమటర్ల వర్షపాతం పడే ఛాన్స్
గురు, శుక్రవారాల్లో తీర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవ్వవచ్చని, కొన్ని చోట్ల 30 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. దానా తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురవొచ్చు. అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.