
Cyclone Dana:దానా తుఫాన్ ఎఫెక్ట్.. కోల్‌కతా.. భువనేశ్వర్ విమానాశ్రయాల్లో రేపటి వరకు కార్యకలాపాలు నిలిపివేత..
ఈ వార్తాకథనం ఏంటి
దానా తుపాన్ తీరాన్ని తాకకముందే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. అనేక తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలు సిద్ధం చేయగా, దాదాపు 10 లక్షల మందిని తరలించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
భారత వాతావరణ శాఖ ప్రకారం, ఈ తుపాన్ గురువారం లేదా శుక్రవారం భిటార్కనికా, ధమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
ఈ తుపాన్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కదులుతుండడంతో ఒడిశాలో సగం జనాభాపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ సర్కారు కూడా ఈ తుపాన్ పట్ల అప్రమత్తం చేసింది. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో ఈ రోజు నుంచి రేపటి ఉదయం వరకు కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించారు.
వివరాలు
నేడు,రేపు ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం
బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి ఈ తుపాన్ పారాదీప్‌కు ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, ధమ్రాకు 360 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ తుపాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర,దక్షిణ 24 పరగణాలు,పుర్బా,పశ్చిమ మెదీనీపూర్, ఝర్‌గ్రామ్,కోల్‌కతా,హౌరా,హుగ్లీ జిల్లాల్లో గురువారం,శుక్రవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ కారణంగా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ గురువారం సాయంత్రం 6గంటల నుండి శుక్రవారం ఉదయం 9గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ కూడా ఇదే సమయానికి తాత్కాలికంగా మూసివేస్తున్నారు.
రైల్వే శాఖ కూడా ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా నడిచే 200 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది.