Fengal Cyclone: ఆంధ్ర , తమిళనాడుకు 'ఫెంగల్' బీభత్సం..! తుఫానుకు ఎవరు పెట్టారో తెలుసా..?
హిందు మహాసముద్రం లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం,తుఫానుగా మారింది. ఇది ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో మంగళవారం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సముద్రతీరం వద్ద గాలులు తీవ్రంగా వీస్తున్నాయి.
చెన్నైతో సహా తొమ్మిది జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
ఈ నేపథ్యంలో అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా కడలూరు, మైలాడుదురై, తిరువారూర్ ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ తుఫాను కారణంగా చెన్నైతో సహా తొమ్మిది జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నాగపట్నం జిల్లాలో వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా,రాబోయే 48గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ తుఫానుకు 'ఫెంగల్' అనే పేరు పెట్టారు. ఇది ఉత్తర హిందు మహాసముద్రంలో మూడో తుఫాను కాగా, రెండో తీవ్రమైన తుఫాను. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులకు ప్రపంచ వాతావరణ సంస్థ(WMO),యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్(UNESCAP)ప్యానెల్‌లోని సభ్య దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి.
అమెరికా ప్రారంభించిన పేరు పెట్టే సాంప్రదాయం
ఈ ప్యానెల్‌లో భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ దేశాలు ఉన్నాయి. అమెరికా ప్రారంభించిన ఈ పేరు పెట్టే సాంప్రదాయం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. వేర్వేరు తుఫాన్లకు పేర్లను ఇవ్వడం వలన వాటిని గుర్తించటం సులభం అయి, వాతావరణశాఖ, మీడియా ప్రజలకు సమాచారం అందించడంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. 2020 ఏప్రిల్‌లో 13 దేశాలు కలిసి బంగాళాఖాతం,అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెట్టేందుకు ఒక గ్రూప్‌గా ఏర్పడ్డాయి. ఈ సభ్య దేశాలు తమ సంస్కృతిని అనుసరించి పేర్లు ప్రతిపాదిస్తాయి.
తదుపరి తుఫాను పేరు'శక్తి'
ఇప్పటివరకు 169 పేర్లతో జాబితా సిద్ధం చేశారు. పేర్లు చిన్నగా ఉండాలి, అదే సమయంలో దేశ సంస్కృతి నుండి సంబంధం లేకుండా ఉండాలని నిబంధనలు ఉన్నాయి. ఒకసారి తుఫాను పేరును నిర్ణయించిన తర్వాత, ఆ పేరు తిరిగి ఉపయోగించబడదు. ప్రస్తుతం బంగాళాఖాతం లో ఏర్పడిన తుఫానుకు 'ఫెంగల్' అనే పేరు సౌదీ అరేబియా ప్రతిపాదించింది. తదుపరి తుఫాను వస్తే, శ్రీలంక సూచించిన 'శక్తి' అనే పేరు పెట్టనున్నారు.