Year Ender 2024: ఈ ఏడాది భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు
2024 సంవత్సరం ముగింపుకు చేరువగా, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుండగా, ఈ ఏడాది మన దేశానికి ఎన్నో చేదు సంఘటనలను మిగిల్చింది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు భయానక విజృంభణతో దేశంలోని ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం
2024, జూలై 30న కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 420 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 397 మంది గాయపడగా, 47 మంది గల్లంతయ్యారు. 1,500 ఇళ్లకు పైగా పూర్తిగా ధ్వంసమవ్వగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెమాల్ తుఫాను తాకిడి 2024, మే 26న ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సుందర్‌బన్ డెల్టాను తాకింది. ఈ తుఫాను 33 మంది ప్రాణాలను బలిగొంది. బెంగాల్, మిజోరం, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ విధ్వంసం సంభవించింది.
ఫెంగల్ తుఫాను ప్రభావం
2024, నవంబర్ 30న పుదుచ్చేరి తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాను 19 మంది ప్రాణాలను బలిగొంది. పుదుచ్చేరిలో 46 సెం.మీ. వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తుఫాను భారీ నష్టాన్ని కలిగించింది. విజయవాడ వరదలు 2024, ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 9 వరకు విజయవాడలో వరదలు సంభవించాయి. భారీ వర్షాలు, నదుల ఉప్పొంగడతో 45 మంది ప్రాణాలు కోల్పోగా, 2.7 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. బుడమేరు వాగు, కృష్ణా నది నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్ వరదలు
2024, జూన్-ఆగస్టు మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు భయంకర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ విపత్తులో 31 మంది మృతి చెందగా, 33 మంది గల్లంతయ్యారు. లాహౌల్, స్పితి జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లగా, 121 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు రాష్ట్రానికి రూ.1,140 కోట్ల నష్టం తెచ్చింది. అస్సాం వరదలు 2024లో అస్సాంలో వరదల కారణంగా 117 మంది ప్రాణాలు కోల్పోగా, జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా వరదలతో తీవ్రంగా బాధపడుతున్న అస్సాంలో ఈ సంవత్సరం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ ఘటనలు 2024 సంవత్సరం మన దేశ చరిత్రలో తీవ్రంగా ముద్ర వేశాయి. ఈ సంవత్సరం కష్టాలను మర్చుకుని, రాబోయే 2025కు ఆశాజనకమైన కొత్త ప్రారంభం ఆశిద్దాం.