Heavy Rains: ఏపీకి వాయుగుండం హెచ్చరిక.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. భారత వాతావరణశాఖ ప్రకారం ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశముంది. ఆపై, ఇది తీవ్ర వాయుగుండంగా మారి, నవంబర్ 27 నాటికి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఈ రోజు నుంచి రాబోయే మూడ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఇప్పటికే నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, కడప, నంద్యాల, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ తదితర జిల్లాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్షాల కారణంగా వరి కోతలు, ఇతర వ్యవసాయ పనులపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, నవంబర్ 25 నాటికి వాయుగుండంగా మారవచ్చు. తమిళనాడు-శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వివరించారు.