కూల్ డ్రింక్ వలలో చిక్కిన ఘరానా దంపతులు.. మోసగత్తె డాకు హసీనా అరెస్ట్
ధనవంతురాలు కావాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కిన డాకు హసీనా ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. రూ.8.4 కోట్ల భారీ దోపిడీ కేసులో ప్రధాన నిందితురాలు, పోలీసుల కళ్లు గప్పి తిరుగుతోంది. కూల్ డ్రింక్ డ్రామా ఆడిన పంజాబ్ పోలీసులు డాకు హసీనా అలియాస్ మన్‌దీప్ కౌర్ ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 10న లుథియానా న్యూ రాజ్‌గురు నగర్ ప్రాంతంలోని సీఎంఎస్ సెక్యూరిటీ కంపెనీకి చెందిన ఐదుగురు ఉద్యోగులను నిర్బంధించి అత్యంత చాకచక్యంతో హసీనా దాదాపు రూ.8.4 కోట్లను కొల్లగొట్టింది. ఈ మేరకు విచారణలో భాగంగా హసీనాను పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో కోటీశ్వరరాలు కావాలనే ఉద్దేశంతోనే దొపిడీకి పాల్పడ్డానని నేరం అంగీకరించింది.
అప్పుల పాలైన హసీనా దోపిడీకి తెరలేపింది
అయితే గత రుణాలతో తాను అప్పుల పాలయ్యానని, అంతకుముందు ఓ బీమా కంపెనీలో ఏజెంట్‌గా, న్యాయవాది వద్ద అసిస్టెంట్‌గా పని చేసినట్లు విచారణలో వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్వీందర్ సింగ్ ను హసీనా అలియాస్ కౌర్ పెళ్లి చేసుకుంది. అసలేం జరిగిందంటే : భారీ దోపిడీ అనంతరం డాకు హసీనా తన భర్త జస్వీందర్ సింగ్ తో కలిసి నేపాల్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా హరిద్వార్, కేదార్ నాథ్, హేమకుంబ్ సాహిబ్ సహా పలు పుణ్య క్షేత్రాలను దర్శించాలని భావించారు. ఈ కోవలోనే హసీనా దంపతులు సిక్కు మందిరాన్ని సందర్శిస్తున్నారు.
కూల్ డ్రింక్ సర్వీస్ పేరిట స్పెషల్ ఆపరేషన్
మందిరాలను సందర్శిస్తున్న సమాచారం పంజాబ్ పోలీసులకు తెలిసింది. దీంతో దోపిడీ జంటను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ కు 'రాణి తేనెటీగను పట్టుకుందాం' అని పేరు పెట్టారు. ఉత్తరాఖండ్‌లోని సిక్కు మందిరాన్ని దర్శిస్తున్న భక్తుల్లో హసీనా జంటను గుర్తించేందుకు యాత్రికులకు ఉచితంగా కూల్ డ్రింక్ సర్వీస్ ఏర్పాటు చేయాలని పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే నిందితులు డాకు హసీనా దంపతులు స్టాల్ వద్దకు చేరుకున్నారు. అయితే ముఖాలను దుస్తులతో కప్పుకున్న ఈ దంపతులు, శీతల పానీయం తాగేందుకు ముఖాలను తెరిచారు.
ఇప్పటికే 9 మంది అరెస్ట్
ఈ క్రమంలో పోలీసులను గమనించిన డాకు హసీనా జంట, హుటాహుటిన పారిపోయేందుకు యత్నించారు. నిందితుల వెంటే పరుగెత్తిన పోలీసులు ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు గిద్దర్‌బాహాకు చెందిన మరో నిందితుడు గౌరవ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 12 మంది నిందితుల్లో ప్రధాన నిందితురాలిగా డాకు హసీనా అలియాస్ కౌర్ గా నిర్థారించారు. దోపిడీ సొమ్ము రికవరీపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.