LOADING...
Kerala: కేరళ పాఠశాల బయట ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు..10 ఏళ్ల బాలుడు,వృదురాలికి గాయాలు  
కేరళ పాఠశాల బయట ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు..10 ఏళ్ల బాలుడు,వృదురాలికి గాయాలు

Kerala: కేరళ పాఠశాల బయట ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు..10 ఏళ్ల బాలుడు,వృదురాలికి గాయాలు  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని పాలక్కాడ్ జిల్లా వడకంధర ప్రాంతంలోని ఒక పాఠశాల బయట బుధవారం సాయంత్రం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అక్కడ కొన్ని ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు కన్పించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఆ సమయంలో ఆ పాఠశాలకు చెందిన 10 ఏళ్ల నారాయన్‌ అనే విద్యార్థి ఆటలాడుకుంటూ బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న పేలుడు పదార్థాలను చూశాడు.వాటిల్లో ఒకదాన్ని విసిరేయగా.. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ బాలుడు స్వల్పంగా గాయపడగా, సమీపంలో ఉన్న ఓ వృద్ధురాలికీ గాయాలు అయ్యాయి.

వివరాలు 

మరో నాలుగు ప్రమాదకరమైన పేలుడు పదార్థాల గుర్తింపు 

పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని స్థలాన్ని తనిఖీ చేయగా, మరో నాలుగు ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, ఆ పదార్థాలు అత్యంత ప్రమాదకరమైనవని, కావాలనే ఎవరో వాటిని ఆ ప్రదేశంలో ఉంచినట్లు భావిస్తున్నామని తెలిపారు. అలాగే, పేలుడు పదార్థాలను అక్కడ ఎవరు ఉంచారన్న విషయాన్ని తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

ఘటనపై స్పందించిన రాజకీయ పార్టీలు 

ఈ ఘటనపై రాజకీయ వర్గాలు కూడా స్పందించాయి. బీజేపీ జిల్లా నాయకులు, దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ, నిజానిజాలు వెలికి తీయడానికి సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సీపీఐ(ఎం) నేతలు ఆ పాఠశాల యాజమాన్యానికి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆ ప్రాంత వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా ఈ పేలుడు పదార్థాల వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని కోరారు.