తల్లికి షాక్ ఇచ్చిన బాలిక.. సెల్ ఫోన్ లాక్కుందని చక్కెర డబ్బాలో పురుగుల మందు పెట్టిన కూతురు
కొవిడ్ కాలం నుంచే టీనేజీ పిల్లలు చాలా వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు బానిసయ్యారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే తమ పిల్లలు మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల బారిన పడిన విషయాన్ని కొందరు తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు. అయితే అలా గుర్తించి, పిల్లలను వారించడమే అమ్మనాన్నలకు శాపమైపోతోంది. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఓ టీనేజ్ అమ్మాయి, ఏకంగా తల్లి హత్యకే కుట్ర చేసింది. అహ్మదాబాద్ లో ఓ 13 ఏళ్ల బాలిక సెల్ ఫోన్ కోసం ఏకంగా తన తల్లినే చంపేందుకు చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది.
కూతురు చేసిన పనిని జీర్ణించుకోలేకపోతున్న తల్లిదండ్రులు
అహ్మదాబాద్ పశ్చిమ నగరంలో ఉండే 45 ఏళ్ల మహిళ, తన ఇంట్లోని వంట గదిలో చక్కెర డబ్బాలో షుగర్ కు బదులు పురుగుల మందు ఉన్న సంగతిని గుర్తించింది. సదరు డబ్బాలోకి పురుగుల మందు ఎలా వచ్చిందోనని ఆరా తీసింది. ఈ కుట్రకు పాల్పడింది తన కూతురేనని తెలిసి మనసు ముక్కలైంది. అంతేకాక బాత్రూంలో ఫ్లోర్ పై ఫినాయిల్ పోసినట్లు తల్లి గమనించింది. దీంతో షాక్ తిన్న తల్లి వెంటనే అభయ్ ఉమెన్ హెల్ప్ లైన్ కేంద్రానికి ఫోన్ చేసింది. జరిగిందంతా చెప్పి సమస్య పరిష్కారానికి సలహాలు కోరింది. అయితే స్మార్ట్ ఫోన్ లాక్కున్నందుకే తల్లికి హాని తలపెట్టాలని బాలిక తలిచినట్టు హెల్ప్ లైన్ కౌన్సెలర్ ఫల్గుని పటేల్ మీడియాకు వెల్లడించారు.
రాత్రుళ్లు ఫోన్ ఎక్కువగా చూస్తోందని తల్లి మందలింపు
మరోవైపు పాప చేష్టలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఉమెన్ కౌన్సెలర్ పటేల్ చెప్పారు. సదరు బాలిక నిత్యం ఫోన్లోనే ఉంటోందని, రాత్రుళ్లు మరీ ఎక్కువగా చూస్తోందని తల్లి తమతో చెప్పినట్లు పేర్కొన్నారు. నిత్యం స్మార్ట్ ఫోన్లో స్నేహితులతో చాటింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో రీల్స్, పోస్టులు చూసేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా ఫోన్ కు బానిసై క్రమేపీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోందన్నారు. మరోవైపు చదువులపైనా చెడు ప్రభావం పడిందని కౌన్సెలర్ స్పష్టం చేశారు. సదరు తల్లిదండ్రులకు పెళ్లైన 13 ఏళ్లకు పాప పుట్టిందని అల్లారు ముద్దుగా పెంచుకున్నారన్నారు. ఇప్పుడు అడిగింది కాదనడంతో బాలిక, మీతిమీరిన ప్రవర్తనతో తల్లి అడ్డు తొలగించుకునే కుట్ర చేసిందన్నారు. ఈ చర్యలను తల్లి జీర్ణించుకోలేకపోతున్నారని పటేల్ వివరించారు.
కొవిడ్ కాలం తర్వాత ఈ తరహా కేసులు బాగా పెరిగాయి : అభయం హెల్ప్ లైన్
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి చెంది అప్పట్లో అంతా కల్లోలంగా ఉండేది. దినదినం ప్రాణ సంకటంతో ఎక్కడికక్కడ అన్నీ వ్యవస్థలు బంద్ అయ్యాయి. ఫలితంగా ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టి స్కూళ్లకు సెలవులిచ్చాయి. ఈ కాలంలో 2020 తర్వాత నుంచే టీనేజీ పిల్లల ఫోన్ కేసులు చాలా వస్తున్నాయని ఫల్గుని అన్నారు. కరోనా వ్యాప్తికి ముందు, రోజుకు 3 లేదా 4 మాత్రమే ఇలాంటి కేసులు వచ్చేవని, ఇప్పుడవి 15కు పెరగడంపై పటేల్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ లెక్కన ఏడాదికి దాదాపుగా 5400 వరకు ఇలాంటి కేసులు వస్తున్నాయన్నారు. తమ వద్దకు వస్తున్న కేసుల్లో 20 శాతం వరకు 18 ఏళ్ల లోపున్న టీనేజర్లేనని పేర్కొనడం గమనార్హం.