Rahul Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన రాహుల్ గాంధీ
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో, హర్యానాలో పరాజయంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. ఈ అనూహ్య ఫలితాలపై తాము సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయం: రాహుల్
"జమ్మూ కశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయం. ఇక, హరియాణాలో అనూహ్య ఫలితాలపై మేము సమీక్ష చేపట్టాం. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. హరియాణాలో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల గళాన్ని మేము వినిపిస్తూనే ఉంటాం" అని రాహుల్ గాంధీ రాసారు.
రాహుల్ గాంధీ చేసిన ట్వీట్
స్వల్పంగా రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా
హర్యానాలో వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ (Bjp) విజయం సాధించింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో 90 స్థానాలకు గానూ 48 స్థానాల్లో విజయం సాధించింది. ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఒక గంట తర్వాత ఫలితాలు మారడం ప్రారంభించి చివరకు బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 37 స్థానాల వద్ద నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మెజారిటీలు చాలా తక్కువగా ఉండటంతో రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈసీ పనితీరుపై, ఈవీఎంలపై వారు ఆరోపణలు చేశారు.
29 సీట్లతో రెండవ అతి పెద్ద పార్టీగా బీజేపీ
ఇంక, జమ్మూ కశ్మీర్‌లో ఇండియా కూటమి (ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ఘన విజయం సాధించింది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), కాంగ్రెస్ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. కూటమిలోని ఎన్‌సీ 42, కాంగ్రెస్ 6, సీపీఎం 1 సీటును గెలుచుకున్నాయి. బీజేపీ 29 సీట్లతో రెండవ అతి పెద్ద పార్టీగా నిలిచింది.