Karnataka: కర్ణాటక మాజీ స్పీకర్ డీబీ చంద్రగౌడ కన్నుమూత
కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ దారదహళ్లి బైరేగౌడ చంద్రేగౌడ ఈరోజు తెల్లవారుజామున చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దారదహళ్లిలోని తన నివాసంలో కన్నుమూసినట్లు కర్ణాటక డీఐపీఆర్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముదిగెరెలోని అడ్యంతయ రంగమందిరంలో భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి బుధవారం (నవంబర్ 8) ఆయన ఎస్టేట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బైరేగౌడ ఆగష్టు 26, 1936న జన్మించారు. ఆయన సన్నిహితులు ఆయనను DBC అని పిలిచేవారు. న్యాయశాస్త్ర పట్టా పొందిన, బైరేగౌడ న్యాయవాదిగా పనిచేశారు. 1971లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
చిక్కమగళూరులో ఇందిరా గాంధీకోసం రాజీనామా
D B చంద్రేగౌడ మొట్టమొదటగా 1971లో చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు, 1977లో రెండోసారి ఎన్నికయ్యారు. 1978లో ఇందిరా గాంధీని చిక్కమగళూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన రాజీనామా చేసి ఆమె విజయం కోసం కృషి చేశారు. లోక్‌సభ ఎంపీకి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై 1979-80 మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1980-81 మధ్య కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. డి బి చంద్రే గౌడ 1983లో తీర్థహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనతా పార్టీ నుండి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అయన 1983-85 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశాడు.
2014 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరం
1986లో జనతా పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1987లో రెండోసారి తీర్థహళ్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 1999లో శృంగేరి నియోజకవర్గం నుండి, 1999,2004 మధ్య న్యాయ మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. డిబి చంద్రే గౌడ 2009లో బీజేపీలో చేరి బెంగుళూరు నార్త్ నుండి లోక్‌సభ స్థానానికి గెలుపొందారు. 2014 నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.