
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ పాకిస్థాన్ సైన్యం డ్రోన్ దాడులకు పాల్పడుతున్న క్రమంలో, భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
నియంత్రణ రేఖ వద్ద పౌరులపై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ సైన్యం పట్ల కఠినంగా, శిక్షార్హంగా వ్యవహరించాలని ఆయన భారత సాయుధ దళాలను ఆదేశించినట్టు సమాచారం.
పాకిస్తాన్ తగినబుద్ధి చెప్పాల్సిందేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో,శనివారం న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ భద్రతా సమీక్ష సమావేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS),త్రివిధ దళాధిపతులు హాజరవుతారు.
అంతకు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంక్షోభంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
వివరాలు
రాజౌరీ ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు
ఈ సమావేశంలో రక్షణ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ సిబ్బంది చీఫ్, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇక పాకిస్తాన్ వైపు నుంచి దాడులు కొనసాగుతున్నట్టు ఇటీవలి ఘటనలు తెలుపుతున్నాయి.
పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం పలు చోట్ల గట్టి కౌంటర్ చర్యలు తీసుకుంది. శుక్రవారం రోజున జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 20కు పైగా పట్టణాలపై పాకిస్తాన్ డ్రోన్‌లు దాడికి యత్నించాయి.
అయితే, భారత సాయుధ దళాలు అప్రమత్తంగా ఉండటంతో వాటిని సమర్థంగా తిప్పికొట్టగలిగాయి.
వివరాలు
పాకిస్తాన్ సైన్యానికి ధీటైన ప్రతిస్పందన: రక్షణ మంత్రి
ప్రస్తుతం దేశ సైనిక వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా పని చేస్తోంది. పౌరుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.
సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ సైన్యానికి ధీటైన ప్రతిస్పందన ఇవ్వాలని రక్షణ మంత్రి స్పష్టంగా ఆదేశించారు.