Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే
దేశ రాజధాని దిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకీ అధికమవుతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఐదు గంటలకు, ఢిల్లీలో గాలి నాణ్యత మరింతగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 500 పాయింట్లను దాటడంతో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితి కారణంగా ఢిల్లీలో దట్టమైన పొగ మంచు ఏర్పడి, విజిబిలిటీ తగ్గిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరుగుతున్న విధానం
వైద్య నిపుణుల ప్రకారం, ఏక్యూఐ 507 పాయింట్లకు చేరితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా పరిగణిస్తారు. ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి ఇది 65 రెట్లు అధికం కావడం గమనార్హం. శనివారం రాత్రి 9 గంటలకు 327 పాయింట్ల వద్ద ఉన్న ఏక్యూఐ కేవలం 10 గంటల్లో 500 పాయింట్లకు పైగా పెరగడం ఢిల్లీ ప్రజలను కలవరపరుస్తోంది. వాతావరణంలో ఉన్న ఈ కాలుష్య కారకాల వల్ల ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి సమస్యలు, గొంతు ఇబ్బందులు వంటి ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ఇలా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.