Page Loader
Delhi air pollution: గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు 
గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు

Delhi air pollution: గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఒకవైపు కాలుష్య ప్రభావం తీవ్రత ఎక్కువవుతుండగా, మరోవైపు నగరాన్ని గడ్డకట్టే మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) 400 మార్కును దాటింది. ఈ పరిస్థితుల కారణంగా ఢిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌గా మారిందని ప్రజలు చెబుతున్నారు. ప్రజలు ఎక్కువగా ఆరుబయట ఉన్నప్పుడు ఛాతిలో మంట, కళ్లలో మంట వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

వివరాలు 

గాలి నాణ్యత మరింత దిగజారే ప్రమాదం

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, గురువారం ఉదయం 8 గంటలకు ఆనంద్ విహార్ ఏక్యూఐ 405గా, ముండ్కాలో 413, బవానాలో 418, అశోక్ విహార్‌లో 414, ఐటీవోలో 355, జహంగీర్‌పురిలో 435, రోహిణిలో 407గా నమోదయ్యింది. నజాఫ్‌గఢ్‌లో 366, ఆర్‌కేపురం 387, పంజాబీ బాగ్ 407, సోనియా విహార్ 394, ద్వారకా సెక్టార్-8లో 401 ఏక్యూఐతో రికార్డయింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM)తెలిపిన వివరాల ప్రకారం,నగరంలో వాయువ్య దిశనుంచి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు అంచనా వేసింది. శుక్ర,శనివారాల్లో గాలుల ప్రభావం కొనసాగుతుందని,ఈ సమయంలో దట్టమైన పొగమంచు కమ్మే అవకాశం ఉందని పేర్కొంది. దాంతో,గాలి నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

రాబోయే ఐదు రోజుల్లో దట్టమైన పొగమంచు

ఎన్‌సీఆర్ పరిధిలో గాలి విషపూరితంగా మారిన నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ శాఖలలో 50% ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వంలోని 80 విభాగాలు, ఇతర ఏజెన్సీలు కలిపి దాదాపు 1.40 లక్షల మంది ఉద్యోగులకు ఇది వర్తింపజేసింది. అలాగే, గురుగ్రామ్ ప్రాంతంలోని ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్న ఎన్‌సీఆర్ ప్రాంతంలోని గురుగ్రామ్, సోనిపట్, ఫరీదాబాద్ నగరాల్లో పాఠశాలలు మూసివేశారు. రాబోయే ఐదు రోజుల్లో ఈ ప్రాంతంలో మరింత దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

వివరాలు 

తక్షణ చర్యలు 

వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం మరింత కృషి అవసరమని నిపుణులు చెబుతున్నారు.