Page Loader
Delhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్‌
దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్‌

Delhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ ఉదయం నుంచి 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ (జీఆర్‌ఏపీ)-4' కింద మరిన్ని కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ పరిధిలో, ఢిల్లీకి ట్రక్కుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. నిత్యావసర సరుకులను తీసుకువెళ్లే ట్రక్కులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్‌-4 ప్రమాణాలకు తగిన డీజిల్‌ ట్రక్కులకి మాత్రమే రాకపోకల కోసం అనుమతిని ఇస్తారు.

వివరాలు 

కాలుష్యంపై ఆందోళన 

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయిపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్‌ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అన్ని రకాల నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్‌లు, వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లతో సహా అన్ని నిర్మాణ ప్రాజెక్టులను తక్షణం ఆపాలని స్పష్టం చేసింది. అదనంగా, సరి-బేసి వాహన నిబంధనల అమలుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

వివరాలు 

పొగమంచు ప్రభావం.. విమానాలు రద్దు 

కేవలం కాలుష్యంతోనే కాకుండా, దట్టమైన పొగమంచు కూడా పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది. దాని ప్రభావంతో వాహనాలు కనపడని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం ఇంతటి తీవ్రస్థాయికి చేరడంతో, ఆదివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలు రద్దు చేయగా, 107 విమానాలు ఆలస్యమయ్యాయి. విద్యా, కార్యాలయాలపై ప్రభావం సీఏక్యూఎం సూచనల మేరకు, ఇప్పటికే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజా ఆదేశాల ప్రకారం, ఆన్‌లైన్ తరగతులను 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు కూడా విస్తరించాలని నిర్ణయించారు. దీంతో, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలు ఆన్‌లైన్ మోడ్‌లో కొనసాగాలని ఢిల్లీ సీఎం అతిషి మార్లెనా విద్యాశాఖను ఆదేశించారు.

వివరాలు 

50% సామర్థ్యంతో కార్యాలయాలు 

ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు 50% సామర్థ్యంతో పని చేయాలని, మిగిలిన సిబ్బందిని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో కొనసాగించాలని సీఏక్యూఎం సూచించింది. ఈ నిబంధనలతో కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజల భాగస్వామ్యంతో ఈ చర్యలు మరింత ఫలవంతం కావాలని ఆశిస్తున్నారు.