Kejriwal Rewari Par Charcha: 'రేవారీ పర్ చర్చా' పేరుతో.. ప్రచారాన్ని ప్రారంభించిన దిల్లీ మాజీ సీఎం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం 'రేవారీ పే చర్చా' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆప్ అందించిన ఆరు ముఖ్య రేవారీలను వివరించారు. అలాగే, ఢిల్లీలో బీజేపీ పాలన వస్తే జరిగే అనర్థాలను స్పష్టంగా ప్రస్తావిస్తూ, బీజేపీపై విమర్శలు గుప్పించారు.
బీజేపీపై తీవ్ర విమర్శలు
కేజ్రీవాల్ ప్రకారం, బీజేపీ పాలనలో ఉన్న 20 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ సరఫరా లేదు. అయితే, ఢిల్లీలో ప్రస్తుతం కరెంట్ కోతలు లేవని, ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ పాలన వల్లే సాధ్యమైందని తెలిపారు. గుజరాత్‌లో 30 ఏళ్లుగా ప్రభుత్వం నడిపినా, 24 గంటల కరెంట్ అందించడం వీరికి సాధ్యపడలేదని ఆరోపించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బదులుగా బీజేపీకి ఓటేస్తే, నగరంలో రోజుకు 8 నుంచి 10 గంటల కరెంట్ కోతలు తప్పవని హెచ్చరించారు.
రేవారీల ద్వారా ప్రజలకు సేవలు
కేజ్రీవాల్ ప్రకటించిన ఆరు రేవారీలను హైలైట్ చేస్తూ, అవి ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ఎంత ముఖ్యమో వివరించారు. ఆరు రేవారీల వివరణ: 1. ఉచిత విద్యుత్: ఢిల్లీలో నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు ఉచితంగా అందించడం. 2. ఉచిత నీరు: ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించడం. 3.అద్భుతమైన విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా మరియు నాణ్యమైన విద్యను అందించడం. 4.మొహల్లా క్లినిక్స్: ఆరోగ్య సేవలను అందుబాటులో ఉంచేందుకు సమర్థమైన మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేయడం. 5. మహిళలకు ఉచిత ప్రయాణం: మహిళలకు నగర బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించడం. 6. వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర: పెద్దల కోసం ఉచితంగా యాత్ర ప్రణాళికను ప్రవేశపెట్టడం.
ప్రజలకు కేజ్రీవాల్ సందేశం
విద్యుత్ కోతలతో బాధపడే స్థితి రావాలనుకుంటే బీజేపీకి ఓటేయండి అని చురకలు అంటించిన కేజ్రీవాల్, ఇకపై ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలియజేయాలంటూ ప్రజలను కోరారు. "కమలం బటన్ నొక్కేముందు దీని ఫలితాల గురించి ఆలోచించండి. మీకు మేలుచేయాలనుకుంటే చీపురు బటన్ నొక్కండి," అంటూ ప్రజలను ప్రేరేపించారు. ఆప్ విజయానికి ఆశలు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గత పదేళ్లుగా విజయవంతమైన పాలన కొనసాగిస్తూ, ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్య సేవలతో ప్రజల మనసులు గెలుచుకుంది. తాజా ఎన్నికల్లో కూడా ప్రజలు ఆప్‌కు మద్దతు ఇచ్చి ఈ సేవలను కొనసాగిస్తారని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.