Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు మరో షాక్.. ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. ఐఏఎస్ అధికారిగా ఎంపిక కావడానికి నకిలీ పత్రాలను సమర్పించడం, అధికార దుర్వినియోగం కేసుల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని తిరస్కరించింది. దీంతో, ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. పూజా ఖేద్కర్ వివాదం పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా మొదలైంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తన ఆడి కారులో రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్ ప్లేట్‌లు ఏర్పాటు చేసుకుని, తనకు ప్రత్యేక వసతి, సిబ్బంది, ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్ కేటాయించాలని పట్టుబట్టింది.
వాట్సాప్ సంభాషణలు వైరల్
అదనపు కలెక్టర్ అజయ్ మోర్ గదిలో అనుమతి లేకుండా నేమ్‌ప్లేట్ అమర్చుకుని, ఆ గదిని తన ఛాంబర్‌గా ఉపయోగించుకుంది. ప్రొబేషన్‌లో ఉన్న జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు అందించకూడదు. పూజా ఖేద్కర్ తన ఆదేశాల కోసం కిందిస్థాయి అధికారులను ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణలు వైరల్ అయ్యాయి. ఈ విషయాలను పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత, ఆమె అక్రమాలపై విచారణ మొదలైంది. ఇదే సమయంలో, పూజా ఖేద్కర్ కేంద్రం నుండి ఐఏఎస్ పదవి నుంచి తొలగించబడింది. పూజా ఖేద్కర్ 2022లో ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకోకుండా వాయిదా వేసింది.
2023లో ఆమెకు వ్యతిరేక తీర్పు
ఆ తర్వాత కొన్నిసార్లు పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి, ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలో భాగంగా అంచనా వేసే కీలక పరీక్షలలో హాజరుకాలేదు. అయినప్పటికీ, ఆమె ఎంపిక కుదిరింది. తరువాత, ఈ నియామకాన్ని ట్రైబ్యూనల్‌లో సవాలు చేయడంతో 2023లో ఆమెకు వ్యతిరేక తీర్పు వచ్చింది, అయినప్పటికీ ఆమె నియామకాన్ని కన్‌ఫర్మ్ చేసుకోగలిగింది. పూజా ఖేద్కర్‌పై కేంద్రం విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆమె నకిలీ పత్రాలు సమర్పించి, సివిల్ సర్వీసెస్ పరీక్షలో నిబంధనలను ఉల్లంఘించి ఉత్తీర్ణత సాధించారని తేలింది. ఆమెను శాస్త్రి అకాడమీకి తిరిగి రావాలని యూపీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది.