మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ కి దిల్లీ హైకోర్టు నో
దిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు దిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, అందుకు 6 వారాల పాటు మధ్యంతర బెయిల్‌ను ఇవ్వాలని ఆప్ నేత మనీష్ సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ అభ్యంతరం చెప్పడంతో సదరు పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు అనారోగ్యం బారిన పడ్డ తన భార్యను కలిసేందుకు జూన్ 2న దిల్లీ హైకోర్టు సిసోడియాను అనుమతించింది. జూన్ 3 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ కస్టడీలో భార్యను కలవొచ్చని కోర్టు తెలిపింది. అయితే ఉదయం 10 గంటలకు సిసోడియా తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే సీమా సిసోడియాను ఆస్పత్రికి తరలించారు.
బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారు : దిల్లీ హైకోర్టు
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ కోసం ఆప్ లీడర్, దిల్లీ సర్కార్ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. సీమా సిసోడియా జూన్ 3న శనివారం ఆస్పత్రిలో చేరారు. మధ్యంతర బెయిల్ కోసం సిసోడియా దాఖలు చేసిన దరఖాస్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన పత్రాలు ఇప్పటికీ తారుమారు అవుతున్నాయని ఈడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఆప్ నాయకుడిగా ఉన్న పదవులను మర్చిపోలేమని కోర్టు వ్యాఖ్యానించింది. బెయిల్‌పై విడుదలైతే ఆయన సాక్ష్యాలను తారుమారు చేయవచ్చని లేదా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తీర్పులో పేర్కొంది.