దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా
దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాలు చేయడంతోపాటు అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కవిత ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ ఆఫీసులో ప్రశ్నించడంపై కూడా ఆమె తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పిటిషన్‌ను విచారించిన సూప్రీంకోర్టు ఇలాంటి సారూప్యం ఉన్న పిటిషన్లను ట్యాగ్ చేసిన ధర్మానసం, అన్నింటిని కలిపి విచారించాలని నిర్ణయించింది. ఈ పిటిషన్లంటి విచారణకు మూడు వారాలకు వాయిదా వేసినట్లు ధర్మానసం పేర్కొంది.
మార్చి 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ఈడీ సమన్లపై స్టే, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కవిత మార్చి 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 15 న అత్యవరంగా పిటిషన్ విచారించాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కవిత తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అయితే అత్యవసరంగా విచారించేందుకు తిరస్కరించారు. ఈ కేసును మార్చి 24న విచారిస్తామని పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేల ఎం. త్రివేది ధర్మాసానికి సీజేఐ బదిలీ చేశారు. ఈ క్రమంలో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ త్రివేదితో కూడిన ధర్మానసం మార్చి 24న విచారించాల్సి ఉండగా, దాన్ని మార్చి 27కు విచారణకు జాబితా చేసింది.