మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో గుడ్ న్యూస్.. రెండు సీల్డ్ బాటిళ్లకు అనుమతి
మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో రైల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రెండు సీల్డ్ బాటిళ్ల మద్యాన్ని వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో అంత వేగంగానూ ఉంటుంది. నగరం మొత్తాన్ని అతి తక్కువ సమయంలోనే ట్రాఫిక్ బాధలు లేకుండానే చుట్టి రావచ్చు. మరోవైపు భద్రతపరంగానూ ఎటువంటి ఇబ్బందులూ తలెత్తే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు సైతం సురక్షిత ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు. అయితే మెట్రో ప్రయాణంలో అన్ని వస్తువులను తీసుకెళ్లలేం. కొన్ని వస్తువులపై నిషేధం ఉంటుంది. మద్యం సహా పదునైన ఆయుధాలు, వస్తువులు, పేలుడు పదార్థాలు, తుపాకులు వంటి వాటిని అనుమతించరు.
మద్యం అనుమతిపై నెటిజన్ల విస్మయం
ఈ నేపథ్యంలోనే మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో తీపి కబురు అందించింది. దిల్లీ మెట్రోలో రెండు సీల్డ్ బాటిళ్ల మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని డీఎమ్ఆర్ సీ (దిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్) వెల్లడించింది. దిల్లీ మెట్రోలోని బ్లూ లైన్ మార్గంలో మద్యం బాటిళ్లను ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించడం పట్ల పలువురు నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెట్రో ఉన్నతాధికారులను ఓ నెటిజన్ ప్రశ్నించాడు. స్పందించిన దిల్లీ మెట్రో కార్పొరేషన్ అధికారులు అవును, రెండు సీల్డ్ చేసిన మద్యం సీసాలను అనుమతించబడతాయని బదులివ్వడం గమనార్హం.