
దిల్లీ సర్కారు బడిలో అమానుషం.. హిందీ పుస్తకం తేలేదని చితకబాదిన టీచర్,ఆస్పత్రిలో విద్యార్థి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ దెబ్బలకు తాళలేక ఆరో తరగతి విద్యార్థి ఆస్పత్రి పాలైన హృదయవిదారక సంఘటన జరిగింది.
తరగతి గదిలోకి హిందీ పుస్తకాన్ని తీసుకురాలేదన్న కోపంతో టీచర్ తీవ్రంగా కొట్టాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే బాధిత విద్యార్థి చికిత్స పొందుతున్నాడు.
11 ఏళ్ల అర్బాజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం సదరు విద్యార్థి ఎప్పట్లాగే పాఠశాలకు హాజరయ్యాడు.
ఈ క్రమంలో స్కూలుకు హిందీ పుస్తకాన్ని తీసుకెళ్లడం మర్చిపోయాడు. అయితే అర్బాజ్ వద్ద హిందీ పుస్తకం లేదని గమనించిన ఉపాధ్యాయుడు, విద్యార్థిపై బిగ్గరగా అరిచాడు.
DETAILS
మా కుమారుడి ఆరోగ్యం క్షిణీస్తోంది : బాధిత తండ్రి
ఆకస్మిక పరిణామంతో విద్యార్థి బిక్కమొహం వేశాడు. తాను హిందీ పుస్తకం తీసుకురావడం మర్చిపోయనట్లు బదులిచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు విద్యార్థి అర్బాజ్ ను చితకబాదాడు.
టీచర్ దెబ్బలకు తట్టుకోలేకపోయిన అర్బాజ్, తీవ్ర గాయాలతో సొమ్మసిల్లిపోయాడు. ఈ క్రమంలోనే బాధితుడి మెడను కోసినట్లు తోటి విద్యార్థులు అంటున్నారు. ఈ పరిస్థితిలో గురు తేజ్ బహదూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరోవైపు ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలో జరిగిన ఉదంతాన్ని విద్యార్థి పోలీసులకు చెప్పే పరిస్థితిలో లేడని తండ్రి మహ్మద్ రంజానీ అన్నారు. ఈ మేరకు తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.