సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డి డిప్యూటీ తహశీల్దార్ సస్పెండ్
సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్ చొరబడ్డ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే పోలీసులు డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయగా, తాజాగా ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆనంద్‌కుమార్‌రెడ్డికి రెవెన్యూశాఖ అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేయనున్నారు. జనవరి 19 రాత్రి ఆనంద్‌కుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని స్మితా సబర్వాల్ స్వయంగా ట్వీట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి తన ఇంట్లో ఒకరు అక్రమంగా చొరబడ్డారని, ఇది అత్యంత బాధాకరమని ఆమె ఆదివారం ట్వీట్ చేశారు. ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా, తాళాలు, తలుపులను స్వయంగా తనిఖీ చేసుకోవాలని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి ఆనంద్‌కుమార్‌రెడ్డిని పోలీసులకు అప్పగింత
గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న స్మితా సబర్వాల్ ఇంటి వద్దకు ఆ రోజు రాత్రి ఆనంద్‌కుమార్‌రెడ్డితో పాటు అతని స్నేహితుడు కూడా వచ్చాడు. సెక్యురిటీ సిబ్బంది అడిగితే, ఐఏఎస్ అధికారి నివాసాన్ని సందర్శించేందుకు అక్కడికి వచ్చామని చెప్పారు. ఆనంద్‌కుమార్‌రెడ్డి తన స్నేహితుడిని కారులోనే ఉంచి, స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. అతడిని చూసిన స్మితా సబర్వాల్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసిన స్మితా సబర్వాల్ అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కారును సీజ్ చేసి అతని స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు వచ్చావని అడగ్గా, తన పని గురించి మాట్లాడటానికి వచ్చినట్లు ఆనంద్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పినట్లు సమాచారం.