'Highly deplorable': "బంగ్లాదేశ్ చొరబాటుదారుడిని తలకిందులుగా వేలాడదీసి".. అమిత్ షా వ్యాఖ్యలకు బాంగ్లాదేశ్ అభ్యంతరం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను సోమవారం నాడు బంగ్లాదేశ్ తీవ్రంగా నిరసించింది. అమిత్ షా బంగ్లాదేశ్ జాతీయులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని పేర్కొంది. ఢాకాలో ఉన్న భారత డిప్యూటీ హైకమిషనర్‌కు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ నిరసన పత్రాన్ని అందజేసింది. ఈ పత్రంలో, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వేదనను, విచారాన్ని కలిగించాయని వివరించారు.
బంగ్లాదేశ్ జాతీయులపై కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
ఇదే సందర్భంలో, బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, పొరుగు దేశంపై అభ్యంతరకరమైన, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయకుండా తమ రాజకీయ నాయకులను నియంత్రించాల్సిందిగా సూచించింది. అతి ముఖ్యమైన పదవుల్లో ఉన్న నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు,పరస్పర గౌరవ భావనలకు దెబ్బతీస్తుందని పేర్కొంది. ఇటీవల జార్ఖండ్ పర్యటనలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బంగ్లాదేశ్ జాతీయులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ ప్రజలు బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే, అక్రమంగా ప్రవేశించిన ప్రతి బంగ్లాదేశ్ చొరబాటుదారుడికి గుణపాఠం చెబుతామని, వారిని తలకిందులుగా వేలాడదీస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.