నగిరిలో సీఎం ముందే భగ్గుమన్న విభేదాలు.. ఎడామొహం, పెడమొహంగా మంత్రి రోజా, కేజే శాంతి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరి పర్యటన సందర్భంగా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నగరిలో ఎప్పటి నుంచో మంత్రి రోజా సెల్వమణి కు అసమ్మతి సెగ ఎదురవుతోంది. మొదట సభ ప్రారంభానికి ముందు కేజే శాంతి, మంత్రి రోజా మధ్య సఖ్యత తేవడానికి జగన్ ట్రై చేశారు. వారితో ఏదో మాట్లాడిన సీఎం, ఇద్దరు చేతులు కలపాలని పేర్కొన్నారు. మొదట కేజే శాంతి తన చేతిని ఇచ్చేందుకు నిరాకరించింది. అయినా సీఎం ఆమె చేయిని పట్టుకొని రోజాతో చేయి కలపాలని ప్రయత్నం చేశారు. అయితే వారు అలా చేతులు కలిపిన వెంటనే వెనక్కి తీసుకోవడం గమనార్హం. గత కొన్ని నెలలుగా మంత్రి పెద్దిరెడ్డి, రోజా మధ్య విబేధాలు ఉన్నాయని తెలిసింది.
జన సమీకరణకు దూరంగా ఉన్న ఐదు మండలాల ఇంఛార్జ్ లు
సీఎం పర్యటన సందర్భంగా ఈ విబేధాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం పర్యటనలో రోజా ఫోటో ఎక్కడా లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది. నగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ఇన్చార్జ్ లు సీఎం కు స్వాగత పలకడానికి పెద్ద ఎత్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, అందులో మంత్రి రోజా ఫోటోలు కనిపించలేదు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా జన సమీకరణకు రోజాకు పెద్ద తలనొప్పిగా మారిందని సమాచారం. మంత్రి రోజా ఆధ్వర్యంలో సభ జరుగుతుండటంతో ఐదు మండలాల ఇంఛార్జ్ లు జనసమీకరణకు దూరంగా ఉన్నారు. ఇక జగన్ పర్యటన కోసం 50కిపైగా ప్రయివేటు పాఠశాలలకు చెందిన వ్యాన్లను మంత్రి రోజా అనుచరులు తీసుకెళ్లినట్లు తెలిసింది.