Sayaji Shinde: ఆలయాల్లో మొక్కల పంపిణీ.. నటుడు షాయాజీ షిండే ప్రతిపాదనపై స్పందించిన పవన్ కళ్యాణ్
షాయాజీ షిండే ప్రతిపాదించిన పర్యావరణ-ఆధ్యాత్మిక సమన్వయ ఆలోచనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు భక్తులకు మొక్కలు ఇవ్వడం ద్వారా పచ్చదనం పెంచడమే లక్ష్యంగా షాయాజీ చేసిన ఈ ఆలోచనను, పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఆధ్యాత్మికతకు పర్యావరణాన్ని జత చేస్తే భావి తరాలకు మేలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భక్తులు ఆలయాలకు వచ్చే ప్రతిసారి దేవుడి ప్రసాదంగా ఒక మొక్కను స్వీకరించి, దాన్ని నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
దైవ కార్యంగా మారుతుందని భావించిన పవన్ కళ్యాణ్
మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్‌తో జరిగిన సమావేశంలో, షాయాజీ షిండే తన ఆలోచనలను పంచుకున్నారు. మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయం, దగదుశేథ్ గణపతి ఆలయం, మహాలక్ష్మి ఆలయాల్లో "వృక్ష ప్రసాద్ యోజన" పేరుతో మొక్కలు ప్రసాదంగా అందజేస్తున్నామని ఆయన వివరించారు. తాను విస్తృతంగా మొక్కలు నాటడం తన జీవితంలో ఒక భాగంగా మారిందని, తల్లి కన్నుమూసినప్పుడు ఆమె బరువుతో సమానమైన విత్తనాలను నాటినట్టు పవన్ కళ్యాణ్‌తో పంచుకున్నారు. భవిష్యత్తు తరాలకు పచ్చదనాన్ని అందించాలంటే చిన్ననాటి నుంచే ఈ అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. ప్రసాదంతో పాటు భక్తులకు మొక్కలను అందించడం, వాటిని నాటేలా ప్రోత్సహించడం ఒక దైవ కార్యం గా మారుతుందని పవన్ కళ్యాణ్ వివరించారు.