DK Shivakumar: 'నన్ను కూడా ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు'.. మరో బాంబు పేల్చిన కర్ణాటక సీఎం డీకే
ఈ వార్తాకథనం ఏంటి
మంత్రులపై రహస్య కుట్ర జరుగుతోందని ఇటీవల హెచ్చరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. తనను కూడా ట్రాప్ చేసేందుకు కొందరు ప్రయత్నించారని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రహస్య కార్యాచరణ ద్వారా తనను ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే మంత్రులు, పార్టీ నేతలను అప్రమత్తం చేసినట్లు వివరించారు. దిల్లీలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరే ముందు గురువారం తనను కలిసిన విలేకరులతో శివకుమార్ మాట్లాడారు. మంత్రులను రహస్య కార్యాచరణ ద్వారా ఇరికించేందుకు ప్రయత్నించిన 'పితామహుడు' ఎవరో తనకు తెలుసని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఏజెంట్లను నియమించుకోవడం,వారికి ఆర్థిక సహకారం అందించడం వంటి అంశాలను గుర్తించినట్లు వెల్లడించారు.
వివరాలు
ఈ స్టింగ్ ఆపరేషన్ వెనుక కన్నడిగులు ఉన్నారా?
తాను చేస్తున్న ఆరోపణలన్నింటికీ ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడాలి,ఎలా మాట్లాడాలి,ఎప్పుడు మాట్లాడాలనే విషయాలు తనకు తెలుసని శివకుమార్ వ్యాఖ్యానించారు.
ఈ స్టింగ్ ఆపరేషన్ వెనుక కన్నడిగులు ఉన్నారా? ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారా? అనే విషయాన్ని తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
తన వద్దకు వచ్చిన వ్యక్తులకు సంబంధించిన వివరాలు, ఫొటోలు ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారికంగా నమోదై ఉంటాయని తెలిపారు.
ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కుమారస్వామిని ఉద్దేశిస్తూ శివకుమార్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
'గుమ్మడికాయల దొంగ అంటే ఎవరో భుజాలు తడుముకుంటున్నారు' అన్న చందంగా కొందరి తీరు ఉందని అన్నారు. అవసరమైతే ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
వివరాలు
ఓటు హక్కుకు రక్షణ కల్పించాలి
దేశానికి మంచి పాలకులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని డీకే శివకుమార్ అన్నారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు వస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోందని, అయితే దీనికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
గత 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యం వల్లే అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయనే వాస్తవాన్ని విస్మరించలేమని వ్యాఖ్యానించారు.
దేశ ప్రజల మనసులను గెలుచుకోవడంతోపాటు వారికి భద్రత కల్పించినప్పుడే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని శివకుమార్ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల కమిషన్ వ్యవస్థను తప్పుదారి పట్టించి, దాని ద్వారా ప్రయోజనం పొందాలని భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించారు.
వివరాలు
ఓటు హక్కుకు రక్షణ కల్పించాలి
'సర్' ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ తదితరులపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించారు.
అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించబోమని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చినట్లు శివకుమార్ తెలిపారు.
కర్ణాటకలో తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రతి ఓటరు హక్కును కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని స్పష్టం చేశారు.
వివరాలు
ఓటు హక్కుకు రక్షణ కల్పించాలి
అక్రమంగా నమోదైన ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లపై ఉన్న ఓట్లను తొలగించడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని అన్నారు.
అయితే, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యల సారాంశం.
ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఇండియా కూటమి (ఇండియా బ్లాక్) నేతలు చేస్తున్న పోరాటాన్ని శివకుమార్ అభినందించారు.